D Srinivas Passed away: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, పీసీసీ మాజీ చీఫ్ డీ శ్రీనివాస్ కన్నుమూత
Nizamabad: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పీసీసీ మాజీ చీఫ్ డీ శ్రీనివాస్ కన్నుమూశారు. 2004, 2009లో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌గా పని చేశారు. ఎంపీగా, మంత్రిగా సేవలు అందించారు.
Telangana News: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ డీ శ్రీనివాస్ ఈ ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉదయం మూడు గంటలకు తుది శ్వాస విడిచారు. చాలా కాలంగా వయసు సంబంధిత అనారోగ్యంతో ధర్మపురి శ్రీనివాస్ బాధపడుతున్నారు. ఈ ఉదయం సడెన్‌గా గుండెపోటు వచ్చి చనిపోయారు.
నిజామాబాద్‌లో 27 సెప్టెంబర్ 1948న జన్మించిన డీ శ్రీనివాస్... డీఎస్ రాష్ట్ర రాజకీయాలను శాసించారు. సామాన్య కార్యకర్తగా మొదలైన ఆయన రాజకీయ ప్రస్తానం ఎంపీ స్థాయి వరకు వెళ్లారు. 1989లో తొలిసారి నిజామాబాద్ నుంచి పోటీ చేశారు. అక్కడి నుంచి ఎదురన్నదే లేకుండా సాగింది డీఎస్ రాజకీయ ప్రభంజనం. 2004, 2009లో పీసీసీ చీఫ్‌గా ఉన్న డీఎస్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అప్పట్లో టీఆర్ఎస్‌తో పొత్తు కుదర్చడంలో ప్రధానంగా చర్చలు జరిపిందే ఈయనే.
1989, 1999, 2004లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మొదట రూరల్ డెవలప్మెంట్, ఐ అండ్ పీఆర్ మంత్రిగా పని చేశారు. పీసీసీగా ఉన్నప్పుడు 2004 కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2004లో ఉన్నత విద్య, అర్బన్ లాండ్ సీలింగ్ మంత్రిగా సేవలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ ఏర్పాటు కావడంతో 2015 నుంచి డీఎస్ కేసీఆర్‌తో నడిచారు. 2023లో మళ్లీ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి సొంత గూడు కాంగ్రెస్‌లోకి వచ్చేశారు. అప్పటి నుంచి రాజకీయాల్లో యాక్టివ్‌గా లేకపోయినా అడిగితే సలహాలు ఇచ్చేవాళ్లు. ఆయన కాంగ్రెస్‌లో చేరేసరికి ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది.
డీ శ్రీనివాస్ ఫ్యామిలీ మొత్తం రాజకీయాల్లో ఉంది. అయితే వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. డీఎస్‌కు ఇద్దరు కుమారుల్లో ఒకరు కాంగ్రెస్‌లో ఉంటే ఇంకొకరు బీజేపీలో ఉన్నారు. డీఎస్ చిన్న కొడుకు ధర్మపురి అరవింద్ బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. ప్రస్తుతం నిజామాబాద్ ఎంగా కూడా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ కాంగ్రెస్‌తో ట్రావెల్ అవుతున్నారు. ఆయన గతంలో నిజామాబాద్ మేయర్‌గా సేవలు అందించారు.
కాంగ్రెస్ వీరవిధేయుడు
డీఎస్ అంటే కాంగ్రెస్‌లో ఢిల్లీ పెద్దలు కూడా గుర్తు పడతారు. పార్టీ విధేయుడిగా గుర్తింపు తెచ్చుకున్న డీఎస్ అనివార్య కారణాలతో పార్టీని వీడాల్సి వచ్చింది. 2015లో ఎమ్మెల్సీ ఇవ్వలేదని కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్‌ఎస్లో చేరారు. అక్కడ 2016-2022 వరకు రాజ్యసభ సభ్యుడు అయ్యారు. అనంతరం అక్కడ కూడా కేసీఆర్‌తో పొసగకపోవడంతో మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. ఏ పార్టీతో తన రాజకీయా ప్రస్తానం ప్రారంభమైందో ఆ పార్టీలోనే తుది శ్వాస విడిచారు.