Telangana Congress: కాంగ్రెస్ సీనియర్లతో మాజీ ఎమ్మెల్యే లంచ్ మీటింగ్, రేవంత్ లేకుండానే - చక్రం తిప్పుతున్నారా?
ఈ విందు ఏర్పాటు చేయడంలో ఎలాంటి వ్యూహం లేదని, ప్రతిసారి విందు ఏర్పాటు చేస్తానని, అలాగే ఈ సారి కూడా లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశానని మాజీ ఎమ్మెల్యే అన్నారు.
Jubilee Hills Ex MLA Vishnu Vardhan Reddy: జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తన నివాసానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లను మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. అయితే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేకుండా ఈ సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అయింది. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌లో నేతల మధ్య మళ్లీ విభేదాలు తెరపైకి వచ్చిన వేళ ఈ లంచ్ మీటింగ్ కి ప్రాధాన్యం ఏర్పడింది. ఆయన ఆహ్వానానికి తగ్గట్లుగానే పలువురు సీనియర్ నాయకులు లంచ్ మీటింగ్‌కు వెళ్లారు.
ప్రత్యేక అజెండా ఏం లేదు - మాజీ ఎమ్మెల్యే
దివంగత పి.జనార్థన్ రెడ్డి తనయుడైన విష్ణువర్థన్ రెడ్డి, నేడు ఉదయం మీడియాతో మాట్లాడుతూ ఈ భేటీపై స్పందించారు. తాను ఈ విందు ఏర్పాటు చేయడంలో ఎలాంటి వ్యూహం లేదని, ప్రతిసారి విందు ఏర్పాటు చేస్తానని, అలాగే ఈ సారి కూడా లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశానని అన్నారు. అందుకోసం హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న కాంగ్రెస్ సీనియర్లను ఆహ్వానించినట్లుగా చెప్పారు. అప్పుడప్పుడూ వారిని కలుస్తూనే ఉంటానని, ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చినందుకే తాజాగా సీనియర్ లీడర్లను భోజనానికి పిలిచినట్లుగా చెప్పారు. వీహెచ్, మధుయాస్కి గౌడ్, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు వస్తామని చెప్పినట్లు చెప్పారు.
అందుకే రేవంత్ ను ఆహ్వానించలేదు
రేవంత్ రెడ్డి వస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఆయన ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారని, భట్టి విక్రమార్క కూడా హస్తినలోనే ఉన్నారని చెప్పారు. వారు అక్కడ ఉన్నారని తెలిసి పిలవలేదని చెప్పారు. హైదరాబాద్‌లో ఉంటే పిలిచేవాడినని, వారు హైదరాబాద్ వచ్చాక మరో సందర్భంలో లంచ్ కు పిలుస్తానని చెప్పారు.
సోదరి కాంగ్రెస్ లో చేరడంతో అసంతృప్తి?
అయితే, రెండ్రోజుల క్రితమే పీజేఆర్ కుమార్తె, విష్ణువర్థన్ రెడ్డి సోదరి విజయా రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఆమె పార్టీలో చేరడంపై విష్ణు వర్థన్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆ విషయం గురించి స్పందించేందుకు నిరాకరించారు. అనంతరం ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. పీజేఆర్ వారసత్వాన్ని తాను గానీ, తన సోదరి గానీ భుజాన వేసుకోవడం ఉండదని.. కార్యకర్తలే పీజేఆర్ వారసత్వం కాపాడతారని వ్యాఖ్యానించారు. ఆ అంశంపై మరింతగా మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.