CM Revanth Reddy: నేను, మోదీ, చంద్రబాబు ప్రభుత్వ స్కూల్లోనే చదువుకున్నాం - రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Prathibha Awards 2024: హైదరాబాద్ రవీంద్ర భారతి ఆడిటోరియంలో ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఇందులో విద్యార్థులకు రేవంత్ పురస్కారాలు అందించారు.
Telangana News: తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో కొన్ని సమస్యలు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సింగిల్ ఉపాధ్యాయుడు ఉన్న స్కూళ్లను మూసివేయవద్దని రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమం జరిగింది. వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన గవర్నమెంట్ స్కూళ్ల పిల్లలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. వారికి పురస్కారాలను అందించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్లలో సమస్యలు ఉన్నప్పటికీ పిల్లలు బాగా రాణిస్తున్నారని అన్నారు. తనతో పాటు చంద్రబాబు, ప్రధాని మోదీ లాంటివారంతా ప్రభుత్వ స్కూళ్లలోనే చదువుకున్నామని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. వీరేకాక ప్రస్తుతం ఉన్న 90 శాతం మంది ఐఏఏస్, ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు ప్రభుత్వ బడుల్లో చదువుకున్నవారే అని చెప్పారు. తెలంగాణలోనూ ప్రభుత్వ పాఠశాల విషయంలో మార్పులు తీసుకువస్తామని.. సెమీ రెసిడెన్షియల్ విద్యావిధానంపై రివ్యూ చేస్తామని రేవంత్ అన్నారు.
2024 జూన్ 9 నుంచి జయశంకర్ బడి బాట కార్యక్రమం ప్రారంభం అయిందని.. 20వ తేదీ వరకు కొనసాగుతుందని అన్నారు. ఆదర్శ పాఠశాలల నిర్వహణ మహిళా సంఘాలకే ఇచ్చామని చెప్పారు. విద్యకు కేటాయించే నిధుల్లో ఎక్కువ శాతం జీతాలకే అవుతుందని చెప్పారు. విద్యపై చేసేది ఖర్చు కాదని.. అది, పెట్టుబడి లాంటిదని రేవంత్ రెడ్డి అన్నారు.
గతంలో ఎన్నో స్కూళ్లు మూసేశారు
గత ప్రభుత్వంలో స్కూళ్లలో విద్యార్థులు లేరనే నెపంతో వాటిని మూసేసే పరిస్థితి ఉండేదని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. స్కూళ్లలో టీచర్లు లేరని విద్యార్థులు రావట్లేదు.. విద్యార్థులు లేరని చాలా స్కూళ్లు మూసేశారు. ఇది కోడి ముందా, గుడ్డు ముందా అన్నట్లుగా ఉంటుంది. ప్రభుత్వం టీచర్లను నియామకం చేపట్టకపోతే విద్యార్థులు వచ్చే పరిస్థితి ఉండదని.. వారు లేరనే సాకుతో సింగిల్ టీచర్ ఉన్నస్కూళ్లు అన్నింటిని మూసివేసే పరిస్థితి కొనసాగిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇంకొన్ని స్కూళ్లలో అయితే విద్యార్థుల కన్నా టీచర్ల సంఖ్యే ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉండేదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము తక్షణమే 11 వేల పైచీలుకు పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని రేవంత్ అన్నారు.