KCR Speech: వెకిలి వ్యక్తుల ప్రయత్నాలతో ఆయన ప్రభ ఏనాటికీ తగ్గదు - వాళ్లు మహాత్ములు కాలేరు: కేసీఆర్
గాంధీజీ 153వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ మహాత్ముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద ఈ 16 అడుగుల ధ్యానముద్రలో ఉన్న గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
Gandhi Statue Inaguration: దేశంలో మహాత్ముడిపై కొందరు వెకిలి వ్యక్తులు చేసే వెకిలి ప్రయత్నాల వల్ల గాంధీ ప్రభ ఏ మాత్రం తగ్గదని సీఎం కేసీఆర్ అన్నారు. ఏనాటికైనా గాంధీ సిద్ధాంతమే స్థిరపడుతుందని అన్నారు. గాంధీజీ 153వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ మహాత్ముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద ఈ 16 అడుగుల ధ్యానముద్రలో ఉన్న గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్ పాల్గొన్నారు. అంతకుముందు కేసీఆర్ సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు.
ఆరోగ్య సిబ్బందికి అభినందనలు
గాంధీ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన 16 అడుగుల మహాత్ముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కేసీఆర్ ప్రశంసించారు. కరోనా సమయంలో ధైర్యంగా పని చేసిన సంస్థ గాంధీ ఆస్పత్రి అని గుర్తు చేశారు. ఇక్కడి సిబ్బంది అందరూ గాంధీ స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని కరోనా సమయంలో వీరోచితంగా పోరాడారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆరోగ్య మంత్రి హరీశ్ రావుకు, ఆరోగ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
జై జవాన్ - జై కిసాన్ కనిపించడం లేదు
నేడు (అక్టోబరు 2) గాంధీ జయంతితో పాటు ఆయన శిష్యుడు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా అని కేసీఆర్ గుర్తు చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రవచించిన.. జై జవాన్ జై కిసాన్ నినాదం అమలు కావడం లేదని కేసీఆర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్ పథకం వల్ల జవాను నలిగిపోతున్నాడని అన్నారు. దేశంలో కనీస మద్దతు ధర లేక రైతు కూడా కుంగిపోతున్నాడని, ఎన్నో ఆత్మహత్యలు జరుగుతున్నాయని అన్నారు. మేధావి లోకం దీని గురించి ఆలోచించాలని కోరారు.
విగ్రహ ఖర్చు రూ.1.25 కోట్లు
ధ్యాన ముద్రలో కూర్చున్న మహాత్మాగాంధీ కాంస్యపు విగ్రహాన్ని ప్రభుత్వం రూ.1.25 కోట్లతో గాంధీ ఆస్పత్రి ప్రవేశద్వారం ఎదురుగా ఏర్పాటు చేసింది. 16 అడుగుల ఎత్తుతో, 5 టన్నుల బరువుతో ఈ విగ్రహాన్ని రామ్ సుతార్ ఫైన్ ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో హెచ్‌ఎండీఏ అధికారులు ఏర్పాటు చేశారు.