(Source: ECI/ABP News/ABP Majha)
Dalitha Bandhu News: మూడు వారాల్లోనే దళిత బంధు నిధులు.. ముగిసిన సీఎం రివ్యూ, హాజరైన భట్టి విక్రమార్క
సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్రంలో నాలుగు మూలల్లోని నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుపై అత్యున్నత స్థాయి సన్నాహక సమావేశం జరిగింది.
సామాజిక బాధ్యతో దళితబంధు పథకాన్ని అమలులోకి తీసుకొచ్చినట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దళితులను ఆర్థికంగా అభివృద్ధి పరిచి, వారిని ఉన్నత స్థితిలో నిలబెట్టాలనే ఉద్దేశంతోనే దీన్ని అమలు చేస్తున్నామని కేసీఆర్ అన్నారు. సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్రంలో నాలుగు మూలల్లోని నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుపై అత్యున్నత స్థాయి సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మోత్కుపల్లి నర్సింహులు సహా టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు.
కొత్తగా నాలుగు జిల్లాల్లో..
ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ హుజూరాబాద్, వాసాలమర్రి సహా తెలంగాణలో తూర్పున ఉన్న మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, ఉత్తర దిక్కున తుంగుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, దక్షిణ దిక్కులో అచ్చంపేట-కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ మండలం, పశ్చిమాన జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా దళిత బంధు ప్రాజెక్టును కొత్తగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. వాసాలమర్రి, హుజూరాబాద్‌లో ప్రకటించిన మాదిరిగా ఈ మండలాల్లో కూడా నిధులు విడుదల చేస్తామని అన్నారు.
రెండు మూడు వారాల్లోనే వీటికి నిధులు
ఈ నాలుగు మండలాల్లోనూ రెండు మూడు వారాల్లోనే దశలవారీగా నిధులు విడుదల చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. కాబట్టి, ఆయా మండలాలకు చెందిన అధికారులు గ్రామాలకు తరలాలని ఆదేశించారు. దళితబంధుకు రూపకల్పన అసెంబ్లీ సాక్షిగా జరిగిందని కేసీఆర్ తెలిపారు. ‘‘దళిత సాధికారత కింద రూ.వెయ్యి కోట్లు కూడా నేనే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించా. వివిధ పార్టీలు, వివిధ రంగాలకు చెందిన దళిత పెద్దలు, మేధావులతో చర్చించాక దళితబంధు కార్యక్రమ అమలుకు రూపకల్పన జరిగింది. ఏదైనా మండలాన్ని లేదా నియోజకవర్గాన్ని సంపూర్ణంగా తీసుకుంటే బాగుంటుందని సలహాలు, సూచనలు వచ్చాయి. అందులో భాగంగానే హుజూరాబాద్‌లో దళితబంధు పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది.’’ అని కేసీఆర్ అన్నారు.
ఈ సమావేశానికి నాలుగు మండలాలకు చెందిన జిల్లాల మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు తదితరులు హాజరయ్యారు. ఎస్సీ సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ సహా మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, జగదీశ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, గువ్వల బాలరాజు, గుర్కా జైపాల్ యాదవ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, హనుమంతు షిండే, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు హాజరయ్యారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ రావు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ రామకృష్ణారావు, ఎస్సీ డెవలప్ మెంట్ కార్యదర్శి, సీఎం సెక్రెటరీ రాహుల్ బొజ్జా, ఎస్సీ కార్పోరేషన్ ఎండీ కరుణాకర్, టీఎస్ఎస్ ఎండీ జీటీ వెంకటేశ్వర్ రావు, కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, సూర్యాపేట్ కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, జితేష్ వి.పాటిల్, పి. ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.
దళితబంధు పథకం సన్నాహక సమావేశం పూర్తి పాఠం: https://t.co/A6YDj09LMz
— Telangana CMO (@TelanganaCMO) September 13, 2021