Hare Krishna Heritage Tower: మత మౌఢ్యం ప్రమాదకరం, మనుషుల్ని పిచ్చి వాళ్లను చేస్తుంది: సీఎం కేసీఆర్
Hare Krishna Heritage Tower: మత మౌఢ్యం చాలా ప్రమాదకరమని.. అది మనుషుల్ని పిచ్చి వాళ్లని చేస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. దేవుడు హింసకు వ్యతిరేకం అని చెప్పుకొచ్చారు.
Hare Krishna Heritage Tower: మత మౌఢ్యం ప్రమాదకరం అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మత మౌఢ్యం మనుషులను పిచ్చి వాళ్లను చేస్తుందని వెల్లడించారు. మతం, దేవుడు హింసకు వ్యతిరేకం అని.. మధ్యలో వచ్చిన వాళ్లే మత మౌఢ్యాన్ని ప్రేరేపిస్తున్నారని కామెంట్లు చేశారు. హైదరాబాద్ కోకాపేటలో రాష్ర్ట ప్రభుత్వ సహకారం, శ్రీకృష్ణ గో సేవా మండలి విరాళంతో నిర్మిస్తున్న హరే కృష్ణ హెరిటేజ్ టవర్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఇంతటి ఆధ్యాత్మిక వాతావరణంలో మీ మధ్య ఉన్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. మనుషులు, ప్రాంతాలు, దేశాలు వేరైనా పూజించే పరమాత్ముడు ఒక్కడేనని చెప్పారు. ఆలయం సామాజిక సాంత్వన కేంద్రమని పేర్కొన్నారు. హరే కృష్ణ ఫౌండేషన్ అక్షయ పాత్ర ద్వారా అన్నదానం చేయడం గొప్ప విషయమని వివరించారు.
ఆలయ నిర్మాణం కోసం పాతిక కోట్లు ఇస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ లో ధనవంతుకు కూడా రూ.5 భోజనం తింటున్నారని చెప్పారు. ఎంతో చిత్తశుద్ధి ఉంటేనే అక్షయ పాత్ర లాంటి కార్యక్రమాలు నడుస్తాయని అన్నారు. కరోనా సమయంలో హరే కృష్ణ ఫౌండేషన్ ఎన్నో సేవలు అందించిందని గుర్తు చేశారు. అన్ని ఆపద సమయాల్లో ప్రజలకు అండగా నిలిచిందని చెప్పారు. నగరంలో హరే కృష్ణ ఆలయం నిర్మించడం మంచి పరిణామని చెప్పారు. ఆలయ నిర్మాణానికి రూ.25 కోట్లు ఇస్తామని ప్రకటించారు. విశ్వ శాంతి కోసం మనం ప్రార్థన చేయాలని పేర్కొన్నారు. మనశ్శాంతి కోసం చాలా మంది మ్యూజిక్ ఆర్ట్ థెరపీ తీసుకుంటున్నారని వివరించారు. మనశ్శాంతి కోసం మరి కొంత మంది గుడులకు వస్తారని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించామని, వేములవాడ, కొండగట్టు ఆలయాలను కూడా అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు తెలిపారు.
200 కోట్ల రూపాయల వ్యయంతో భారీ ఆలయం
హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో నార్సింగిలో భారీ ఆలయాన్ని నిర్మించబోతున్నారు. 400 అడుగుల ఎత్తైన హరేకృష్ణ హెరిటేజ్ భవనాన్ని కడతారు. 200 కోట్ల రూపాయల వ్యయంతో ఆలయ నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. రాధాకృష్ణుల ఆలయంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా నిర్మించనున్నారు. ఎక కాలంలో 1500 మంది భక్తులు రాధాకృష్ణుల్ని దర్శించుకునేలా ఆలయ నిర్మాణం చేపడుతున్నారు. ఆలయంతో పాటు 37 వేల చదరపు అడుగులు విస్తీర్ణంలో తిరుమల శ్రీవారి ఆలయ తరహాలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మిస్తారు. తెలంగాణ చరిత్ర, వైభవానికి అద్దం పట్టేలా కాకతీయ నిర్మాణ శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఆలయంలో ఒకేసారి 500 మందికి అన్నదానం జరిగేలా, లైబ్రరీ, కల్యాణ కట్ట, ఆడిటోరియం, కల్యాణ మండపం, ఐ మాక్స్ థియేటర్, ఓపెన్ ఎయిర్ థియేటర్, లెక్చర్ హాల్, క్వీన్ కాంప్లెక్స్, వంద గదులతో గెస్ట్ హౌస్, ఆశ్రమ నిర్మాణం జరగనుంది. భారీ స్థాయిలో నిర్మించబోతున్న ఈ ఆలయం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు.