KCR Birthday Celebrations: సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సీతారాముల కళ్యాణం, ఎక్కడంటే?
KCR Birthday Celebrations: ఫిబ్రవరి 17వ తేదీన సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని హైదరాబాద్ నల్లకుంట కోరంటి ఆస్పత్రి పక్కునున్న రామాలయంలో బీఆర్ఎస్ నేతలు సీతారాముల కల్యాణం నిర్వహించబోతున్నారు.
KCR Birthday Celebrations: ఈ నెల 17వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 69వ పుట్టిన రోజు. అయితే సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ నల్లకుంట కోరంటి ఆస్పత్రి పక్కునున్న పురాతన రామాలయంలో ఘనంగా సీతారాముల కల్యాణం నిర్వహించబోతున్నట్లు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ చిన్ననాటి గురువైన తెలుగు పండిట్ శ్రీ వేలేటి మృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో.. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కన్నులపండువగా సీతారాముల కల్యాణం జరిపిస్తామని వివరించారు. ఈ కల్యాణ మహోత్సవంలో మొత్తం 11 జంటలు పాల్గొనబోతున్నట్లు వెల్లడించారు.
సీతారాముల కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలి..
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ దేశం మొత్తం విస్తరించి, రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కీలక పాత్ర పోషించాలని ఈ కార్యం తలపెట్టినట్లు వివరించారు. అలాగే ఆయురారోగ్యాలతో నూరేళ్ల సీఎం కేసీఆర్ చల్లగా ఉండాలని, ఆయన అనుకున్న లక్ష్యాలు అన్నీ నెరవేరేలా, భవిష్యత్తులో ఆయన భారత ప్రధాని కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ కల్యాణోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొనాలని కోరారు. వచ్చిన భక్తులకు అన్నప్రసాదంతో పాటు తీర్థ ప్రసాదాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి స్పష్టం చేశారు.
మరోవైపు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు నాడే తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించాలనుకున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటుడగానే సచివాలయ కొత్త భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేశారు. కేసీఆర్ పుట్టిన రోజు నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభించకూడదని.. కావాలంటే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టారు కాబట్టి ఆయన పుట్టినరోజు నాడు ఓపెన్ చేయాలని సూచించారు. ఈ క్రమంలోనే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించారు. అంబేడ్కర్ జయంతి రోజు అయిన ఏప్రిల్ 14న ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. అలాగే దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా కేఏ పాల్ ఫిర్యాదు చేశారు.
సచివాలయ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసిన ప్రభుత్వం
తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సందర్భంగా కోడ్ అమల్లో ఉంటుంది. దీంతో సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. కొత్త సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఆగిపోవడం.. తాను హైకోర్టులో చేసిన న్యాయ పోరాటం వల్లే జరిగిందని అన్నారు. కేసీఆర్ తన తప్పును అంగీకరించకుండా ఎమ్మెల్సీ కోడ్ తీసుకొచ్చి వాయిదా వేశారని ఆరోపించారు. సచివాలయం ప్రారంభోత్సవంపై తాను హైకోర్టులో పిటిషన్ వేశానని, అది విచారణ జరుగుతున్నందుకే వాయిదా వేశారని చెప్పారు. కేసీఆర్ పుట్టినరోజున సచివాలయ ప్రారంభోత్సవం జరగకుండా చేశామని అన్నారు.