Chilkoor Balaji Temple Priest: ముస్లిం రైతుకు ఎద్దును బహుమతిగా ఇచ్చిన చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి
Chilkoor Balaji Temple: మావవ సేవే మాధవ సేవ అన్నారు. ఆ మానవుడు ఎలాంటి వ్యక్తి అయిన తోచినంత సాయం చేయడం మన విధి అంటున్నారు చిలుకూరు బాలజీ టెంపుల్ అర్చకులు.
Telangana News: ఆపదలో ఉన్న ముస్లిం ఫ్యామిలీని ఆదుకున్నారు చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకుడు. వారి ఫ్యామిలీకి జీవనాధారమైన ఎద్దులు చనిపోయిన విషయాన్ని గుర్తించి ఆదుకున్నారు. వ్యవసాయం ముందుకు సాగేలా ఎద్దులను ఇచ్చారు.
ఆపదలో ఉన్న రైతులను ఆదుకునే సంప్రదాయాన్ని కొనసాగించారు చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి. కరెంట్ షాక్‌తోవ్యవసాయ ఎద్దును కోల్పోయిన రైతు మొహమ్మద్ గౌస్‌కు ఎద్దును బహుమతిగా ఇచ్చారు. తోటి మానవుడు ఇబ్బందుల్లో ఉంటే సాయం చేయడానికి ఇతర పరిస్థితులు ఏవీ అడ్డం కావని అభిప్రాయపడ్డారు. తోటి మానవుడికి సాయం చేయడమంటే పరమాత్ముని సేవ అని చిలుకూరు బాలాజీ పూజారి, ఆయన శిష్యులు అభిప్రాయపడుతున్నారు.
కొన్నేళ్ల క్రితం అంజియా అనే రైతుకు ఎద్దులను బహుమతిగా ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని పెద్ద మంగళారం గ్రామానికి చెందిన అతని ఎద్దులు కూడా విద్యుదాఘాతంతో చనిపోయాయి. విద్యుదాఘాతం, పిడుగుపాటు లేదా మరేదైనా ప్రమాదంలో పశువులు మరణిస్తే దాన్నే నమ్ముకొని ఉన్న ఫ్యామిలీ ఆదాయంపై ప్రభావం పడుతుంది. అందుకే రెండేళ్ల నుంచి ఇలాంటి రైతుల దుస్థితిని చూసి చలించిపోయిన చిల్కూరు ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గోసేవ చేసే ఔత్సాహికుడు పవన్ కుమార్ సహాయంతో తెలంగాణలో అనేక మంది రైతులకు సహాయం చేశారు.
గతంలో సిద్దిపేటకు చెందిన రైతుకు చిల్కూరు బాలాజీ దేవాలయం ఆవును అందించింది. పక్క గ్రామాలకు చెందిన కొందరు రైతులు కూడా ఎద్దులను అందుకున్నారు. ఆపదలో ఉన్న రైతులను ఆదుకునేందుకు ప్రజలు కూడా అదేవిధంగా పాల్గొనాలని ప్రధాన అర్చకులు కోరారు.
ఆవు, ఎద్దు లేదా గేదెలను రైతులు తమ కుటుంబ సభ్యులుగా పరిగణిస్తున్నారని, పశువులు చనిపోవడంతో రైతు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడుతుందని రంగరాజన్ అన్నారు. అందుకే సాయం చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు 'పశువును బహుమతిగా ఇచ్చే కార్యక్రమాల్లో ప్రతి ఒక్క వ్యక్తి పాల్గొనాలని ప్రజలను కోరారు.