Chikkadpally Inspector Suspend: గ్రూప్ 2 అభ్యర్థి ప్రవళిక సూసైడ్ కేసు - చిక్కడపల్లి ఇన్స్‌పెక్టర్ పై వేటు!
Pravalika suicide incident: ప్రవళిక ఆత్మహత్య కేసు విషయంలో చిక్కడపల్లి ఇన్స్‌పెక్టర్ నరేష్‌పై పోలీస్ శాఖ సస్పెన్షన్ వేటు వేసింది.
Chikkadpally Inspector Suspend: :
హైదరాబాద్ కు వచ్చి గ్రూప్ 2 పరీక్షలకు ప్రిపేర్ అవుతోన్న ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఈ కేసు విషయంలో చిక్కడపల్లి ఇన్స్‌పెక్టర్ నరేష్‌పై పోలీస్ శాఖ సస్పెన్షన్ వేటు వేసింది. ఆయనను తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తూ హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు. చిక్కడపల్లి ఇన్స్ పెక్టర్ నరేష్ సకాలంలో స్పందించక పోవడం వల్లే విద్యార్థులు ఆందోళనకు దిగడం, ప్రతిపక్షపార్టీ నేతలు ఆరోపణలు, విమర్శలకు కారణమైందని పోలీస్ శాఖ భావిస్తోంది.
ప్రేమ విఫలం, ప్రవళిక ఆత్మహత్య
వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన మర్రి ప్రవళిక (23) అశోక్ నగర్ లోని ఓ హాస్టల్ లో ఉంటూ గ్రూప్ - 2 పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. శుక్రవారం ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న వందలాది నిరుద్యోగ అభ్యర్థులు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. గ్రూప్ - 2 పరీక్ష వాయిదా పడడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపిస్తూ నిరసనలు తెలిపారు. వారికి బీజేపీ నేతలు సైతం మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. ఎట్టకేలకు అర్ధరాత్రి తర్వాత పోలీసులు మృతదేహాన్ని అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు.
స్వగ్రామంలో ప్రవళిక అంత్యక్రియలు..
పోస్టుమార్టం పూర్తైన అనంతరం ప్రవళిక మృతదేహాన్ని అక్కడి నుంచి శనివారం ఉదయం ఆమె స్వగ్రామానికి తరలించారు. ప్రవళిక మృతితో ఆమె స్వగ్రామం బిక్కాజిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు, బంధువులు ప్రవళిక అంత్యక్రియలు పూర్తి చేసినా వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది.
ఆరోజు రాత్రి పీఎస్ కు ఫోన్ కాల్..
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కోస్గికి చెందిన శివరామ్ రాథోడ్ అనే యువకుడు, ప్రవళిక ప్రేమించుకున్నారని పోలీసులు తెలిపారు. అయితే శివరామ్ వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడంతో మనస్తాపం చెంది ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని వెల్లడించారు. రాత్రి 8.40 గంటలకు చిక్కడపల్లి పోలీసులకు ఫోన్ కాల్ వచ్చిందని డీసీపీ తెలిపారు. పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి పరీశీలించి, హాస్టల్‌లో ఉన్నవారి నుంచి వివరాలు సేకరించారు. కానీ సమాచారం బయటకు తెలియడంతో చిక్కడపల్లి, అశోక్ నగర్ లో ఉండే విద్యార్థులు ధర్నాకు దిగారు. స్థానిక నేతలు అక్కడికి వచ్చి ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి ప్రవళిక మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేశారు. మరుసటి రోజు ఉదయం ప్రవళిక మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిపారు. సూసైడ్ నోట్ ల్ అమ్మా నన్ను క్షమించు అని రాసింది. ప్రవళిక ప్రేమ వ్యవహారం ఆమె తల్లిదండ్రులకు తెలుసునని, గతంలో వార్నింగ్ ఇచ్చారన్నారు. ఉద్యోగం రాలేదని ఆమె సూసైడ్ చేసుకోలేదని, ప్రియుడు మోసం చేశాడని బలవన్మరణం చెందినట్లు పోలీసులు ప్రెస్ మీట్లో వెల్లడించారు. కానీ జాబ్ నోటిఫికేషన్లు వాయిదా పడటంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ నిరసనకు దిగి శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.