Che Guevara: హైదరాబాద్‌లో చే గువేరా కూతురు, మనవరాలు సందడి - ఎందుకంటే
హైదరాబాద్ నగరానికి వచ్చాక అలైదా గువేరా, ఎస్తేఫానియా గువేరా ఇద్దరూ హిమాయత్ నగర్‌లోని సీపీఐ కార్యాలయాన్ని సందర్శించారు.
క్యూబన్ విప్లవములో ప్రముఖవ్యక్తి, క్యూబా విప్లవ వీరుడు అయిన చే గువేరా వారసులు హైదరాబాద్‌లో సందడి చేశారు. చే గువేరా కుమార్తె అలైదా గువేరా, ఆయన మనవరాలు ఎస్తేఫానియా గువేరా తాజాగా హైదరాబాద్‌కు వచ్చారు. కమ్యూనిస్టు పార్టీల యువజన సంఘాలు శంషాబాద్ ఎయిర్ పోర్టులో వీరికి ఘన స్వాగతం పలికాయి. రవీంద్ర భారతిలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వీరు ఇద్దరు హైదరాబాద్ కు వచ్చారు.
హైదరాబాద్ నగరానికి వచ్చాక అలైదా గువేరా, ఎస్తేఫానియా గువేరా ఇద్దరూ హిమాయత్ నగర్‌లోని సీపీఐ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అలైదా మీడియాతో మాట్లాడారు. క్యూబాలో ప్రజలు పేదోళ్లలా బతికి, ధనికుల్లా చనిపోతారని పేర్కొన్నారు. తమ దేశంలో మహిళా ఫేడరేషన్ ఉంటుందన్నారు. సమాన పనికి సమాన జీతం ఉంటుందని వివరించారు. క్యూబాలో ఆడ, మగ అనే తేడా ఉండబోదని చెప్పారు. నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా (ఎన్‌సీఎస్‌సీ), ఐప్సో (ఏఐపీ ఎస్‌వో)ల సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఇవాళ సాయంత్రం జరగనున్న కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరు అవుతున్నారు. అలైదా గువేరా ఆమె కుమార్తె ఎస్తేఫానియా గువేరా ఈ కార్యక్రమం కోసమే హైదరాబాద్‌కు వచ్చారు.
చే గువెరా ఒక అర్జెంటినా మార్క్సిస్ట్ విప్లవకారుడు, వైద్యుడు, రచయిత, మేధావి, గెరిల్లా నాయకుడు, సైనిక సిద్ధాంతకుడు, క్యూబన్ విప్లవములో ప్రముఖవ్యక్తి. అక్టోబరు 9, 1967 లో ఆయన మరణించిన తరువాత, అతని విలక్షణ శైలి కలిగిన ముఖాకృతి ప్రపంచవ్యాప్తంగా విప్లవభావాల సంస్కృతికి ప్రపంచ చిహ్నంగా మారింది.
యుక్తవయసులో మెడికల్ విద్యార్థిగా ఉన్న చే గువేరా లాటిన్ అమెరికా అంతా పర్యటించారు. అక్కడ ఉన్న పేదరికం చూసి చలించిపోయారు. ఈ పర్యటనలలో అతని పరిశీలనలతో దేశంలో దృఢంగా ఉన్న ఆర్థిక తారతమ్యాలు, ఏకస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ, నూతన వలసవాదం, సామ్రాజ్యవాద ఫలితమేనని నిర్ణయానికి వచ్చారు.
దీనికి ఒకేఒక్క పరిష్కారం ప్రపంచ తిరుగుబాటు అని భావించారు. ఈ నమ్మకం అతణ్ని అధ్యక్షుడు జకబో అర్బెంజ్ గుజ్మన్ ఆధ్వర్యంలోని గ్వాటిమాల సాంఘిక సవరణలలో పాలుపంచుకునేందుకు ప్రేరణనిచ్చింది. అంతిమంగా అధ్యక్షుడిపై CIA-ప్రోద్బలంతో జరిగిన పదవీచ్యుతి గువేరా యొక్క తీవ్రవాద భావజాలాన్ని మరింత పెంచింది. తర్వాత మెక్సికో నగరంలో నివసిస్తున్నప్పుడు, అతను రౌల్, ఫిడేల్ కాస్ట్రోలను కలిశారు. వారి జూలై 26 ఉద్యమంలో చేరి, అమెరికా-మద్దతు ఇచ్చిన క్యూబా యొక్క నియంత ఫుల్జెన్సియో బాటిస్టాను పదవీచ్యుతుణ్ని చేసేందుకు, గ్రాన్మాను అధిరోహించి క్యూబాను ఆక్రమించారు. గువేరా త్వరలోనే విప్లవకారులలో ప్రముఖుడై, సైన్యంలో రెండవస్థానానికి పదోన్నతుడై, బాటిస్టా పాలనను తొలగించడానికి చేసిన రెండు సంవత్సరాల గెరిల్లా పోరాటంలో ప్రముఖపాత్ర వహించారు.
క్యూబా తిరుగుబాటు తరువాత, చే గువేరా నూతన ప్రభుత్వంలో అనేక ప్రధానపాత్రలను పోషించారు. రెవల్యూషనరీ ట్రిబ్యునల్స్ లో యుద్ధ నేరస్థులుగా పరిగణించిన వారి వినతులు, ఫైరింగ్ దళాలను సమీక్షించడం, పరిశ్రమలశాఖ మంత్రిగా, వ్యవసాయ సంస్కరణలను ప్రవేశపెట్టడం, జాతీయ బ్యాంకు అధ్యక్షుడిగా, క్యూబా సైనికదళాల బోధనానిర్దేశకుడిగా, క్యూబన్ సామ్యవాదం తరపున దౌత్యవేత్తగా ప్రపంచ పర్యటనలు చేయడం వంటివి వీటిలో ఉన్నాయి.