Secunderabad Fire Accident: సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి!
Secunderabad Fire Accident: సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. వెంటనే అక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
Secunderabad Fire Accident: సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. తరుచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలతో కాసేపు మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక కలెక్టర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. దట్టంగా అలముకున్న పొగతో స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ కు వివరించారు. వెంటనే ఆ ప్రాంతంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత బస్తీవాసుల యోగ క్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. బీజేపీ మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Deeply concerned about 3 missing youth in yesterday's fire accident in Secunderabad.
— G Kishan Reddy (@kishanreddybjp) January 20, 2023
I will review with concerned officials to ensure rigorous implementation of fire safety protocols.
Civil society role is indeed reassuring as shown in image of doctor rushing to rescue injured pic.twitter.com/mz6Nhe2YbC
అంతేకాకుండా సికింద్రాబాద్ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. సికింద్రాబాద్ లో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు యువకులు అదృశ్యం కావడం తీవ్ర ఆందోళన కల్గిస్తోందని తెలిపారు. ఫైర్ సేఫ్టీ ప్రోటోకాల్ ను పటిష్టంగా అమలు చేసేలా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తానని వెల్లడించారు. గాయపడిన వారిని రక్షించేందుకు పరిగెత్తుతున్న వైద్యుడి ఫొటో.. నిజంగా పౌరసమాజానికి కనువిప్పు కల్గిస్తోందని ఆయన వివరించారు.
నిన్న అసలేం జరిగిందంటే..?
సికింద్రాబాద్(Secunderabad) మినిస్టర్ రోడ్డులో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మంటల ధాటికి ఆరు అంతస్తుల భవనం పూర్తిగా దెబ్బతింది. ఈ భవనంలో 12 గంటలకుపైగా అగ్ని కీలాలు ఉండడంతో లోపలికి ఎవరూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు భవనంలో బిహార్ కు చెందిన ముగ్గురు కూలీలు... జునైద్, వసీం, అక్తర్ చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. మంటలు చెలరేగిన భవనంలోనే ఆచూకీ లభ్యం కాని కూలీల సెల్ ఫోన్ లొకేషన్ చూపిస్తుండడంతో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. కూలీలు ముగ్గురు అదే భవనంలో చిక్కుకొని ఉంటే మాత్రం వారు సజీవ దహనం అయ్యే అవకాశం ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. కూలీల ఆచూకీ కోసం అగ్నిమాపక సిబ్బంది పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. భారీ క్రేన్ సాయంతో బయట నుంచి భవనంపై అంతస్తులోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
భవనం పూర్తిగా దెబ్బతిన్నందున గాలింపు పూర్తయ్యాక కూల్చివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాద సహాయ చర్యల్లో పాల్గొని అస్వస్థతకు గురైన ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏడీఏఫ్ఓ ధనంజయ్ రెడ్డితో పాటు ఫైర్ ఇంజిన్ డ్రైవర్ నర్సింగరావు గురువారం అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నర్సింగరావు పరిస్థితి విషమంగా ఉంది. ఆయనను వెంటిలేటర్ పై ఉంది చికిత్స అందిస్తున్నారు.