Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు బండి సంజయ్ - భారీ ర్యాలీతో దిల్ కుషా గెస్ట్ హౌస్ వరకు పాదయాత్ర
Bandi Sanjay: తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు నమ్మకం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పారు. అయినా బాధ్యత గల పౌరుడిగా హాజరవుతున్నట్టు వెల్లడించారు.

Bandi Sanjay: తెలంగాణలో సంచలనంగా మారుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు కేంద్రమంత్రి బండి సంజయ్ సిట్ ముందు హాజరయ్యారు. గతంలోనే ఆయనకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. వాటిపై స్పందించిన ఆయన ఆగస్టు 8న విచారణకు హాజరవుతానని సమాచారం ఇచ్చారు. చెప్పినట్టుగానే ఇవాళ భారీ హంగామాతో విచారణకు హాజరయ్యారు.
ఇంటి నుంచి సిట్ విచారణకు బయల్దేరిన బండి సంజయ్ ఖైరతాబాద్ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో ఫాలో అయ్యేందుకు భారీగా జన సమీకరణ చేశారు. పూజలు అనంతరం అక్కడి నుంచి పాదయాత్రగా దిల్‌కుషా గెస్ట్‌హౌస్ వరకు వచ్చారు. ఆయనతోపాటు బీజేపీ కార్యకర్తలు నడిచారు.
పాదయాత్రలో పాల్గొన్న బీజేపీ నేతలు, కార్యకర్తలు, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు జాతీయ సమస్య అని దాని దర్యాప్తును సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కేవలం రాజకీయాల కోసం మాత్రమే ట్యాపింగ్ కేసును వాడుకుంటుందని ఆరోపిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
కేటీఆర్, బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కూడా బ్యానర్లు పెట్టారు. ముఖ్యంగా కేటీఆర్‌ను విమర్శిస్తూ ప్లకార్డులు పట్టుకున్నారు.
దారిపొడవున బండి సంజయ్‌కు అనుకూలంగా, కేటీఆర్, బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత్‌మాతాకు జై అంటూ నినదించారు. ఈ పాదయాత్ర వేళ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
ఇంటి నుంచి సిట్ దర్యాప్తునకు బయల్దేరుతున్న టైంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. " సిట్ అధికారులు పిలిచారు...వెళుతున్నా, నా దగ్గరున్న సమాచారాన్ని సిట్‌కు అందజేస్తా. బాధ్యత గల పౌరుడిగా వెళుతున్నా, సిట్ విచారణపై నాకు నమ్మకం లేదు. ఆధారాలున్నా కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడమే దీనికి నిదర్శనం. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనే విషయాన్ని మొట్టమొదట బయటపెట్టింది నేనే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రతి క్షణం నా ఫోన్‌ను ట్యాప్ చేశారు.ప్రజా సమస్యలపై కొట్లాడుతుంటే నన్ను దెబ్బతీయాలని అనేక కుట్రలు చేశారు. మిగిలిన విషయాలు సిట్ విచారణ అనంతరం మాట్లాడతా" అని చెప్పుకొచ్చారు.
Live : Addressing the media at my residence ahead of SIT inquiry in phone tapping case https://t.co/IQ7KyKMAK1
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 8, 2025
Live : Heading to SIT inquiry in Phone Tapping case at Dilkusha Guest House https://t.co/PqF5K0krvy
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 8, 2025





















