తెలంగాణకు కేంద్రం నోటీసులు- రెండు రోజుల్లో 152 కోట్లు తిరిగి ఇవ్వాలని హెచ్చరిక
కేంద్రం, తెలంగాణ మధ్య మరో వార్ షురూ అయింది. ఉపాధి హామీ పథకం నిధులపై ఇరు ప్రభుత్వాల మధ్య మాటలతూటాలు పేలనున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర మధ్య ఇప్పటికే యుద్ధం తీవ్ర స్థాయిలో ఉంది. ఈ రెండు ప్రభుత్వాల మధ్య మరో జగడం మొదలైనట్టే కనిపిస్తోంది. ఉపాధి హామీ పథకం నిధులు దారి మళ్లించారని ఆరోపిస్తూ కేంద్రం నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ సర్కారుకు కేంద్రం నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయని సీరియస్ అయిన కేంద్రం... నోటీసులు జారీ చేసింది. రెండు రోజుల గడువు ఇచ్చింది. లేకుంటే తర్వాత వాయిదాలు నిలిపేస్తున్నట్టు హెచ్చరించింది.
తెలంగాణకు కేటాయించిన ఉపాధి హామీ పథకం నిధుల్లో 152 కోట్ల రూపాయలు దారి మళ్లించారని కేంద్రం ఆరోపిస్తోంది. వాటి లెక్కలు తేల్చాలని ... ఆ నిధులు తిరిగి జమ చేయాలని ఆదేశించింది. దీనికి రెండు రోజుల గడువు ఇస్తున్నట్టు నోటీసుల్లో పేర్కొంది. రెండు రోజుల్లో స్పందించకుంటే ఉపాధి హామీ పథకంలో భాగంగా తదుపరి విడతలో చెల్లించాల్సిన నిధులు నిలిపేస్తామని వార్నింగ్ ఇచ్చింది.