Telangana: సెల్ ఫోన్లు తీసుకురావద్దు- టీచర్స్‌కి విద్యాశాఖాధికారుల ఆదేశం
Cell Phones Ban: తరగతి గదుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఫోన్లు వినియోగించడాన్ని ప్రభుత్వం నిషేధించింది. తరగతి గదులకు ఫోన్లు పట్టుకెళ్ళొద్దంటూ కీలక ఆదేశాలు జారీ చేశారు.
Telangana : తెలంగాణ విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. తరగతి గదుల్లోకి సెల్ ఫోన్లు తీసుకువెళ్లవద్దంటూ స్పష్టం చేసింది. అనేక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు తరగతి గదుల్లో కూడా సెల్ ఫోన్లతో ఎక్కువ సమయం కాలక్షేపం చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి గతంలోనే వచ్చింది. దీంతో తరగతి గదుల్లోకి సెల్ ఫోన్లు తీసుకువెళ్ల వద్దంటూ గతంలో ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాలను పకడ్బందీగా అమలు చేయడంలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యాన్ని వహించారు. ఇదే విషయాన్ని గుర్తించిన రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి ప్రభుత్వ ఉపాధ్యాయులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.
తరగతి గదుల్లోకి ఫోన్ తీసుకువెళ్ల వద్దంటూ స్పష్టం చేసిన ప్రభుత్వం.. ఒకవేళ ఎవరైనా తీసుకువెళ్తే మాత్రం శిక్ష తప్పదు అంటూ హెచ్చరించింది. తరగతి గదుల్లో ఫోన్ వినియోగించే టీచర్లను ఒక కంట కనిపెట్టాలంటూ అధికారులకు ప్రభుత్వం సూచించింది. అత్యవసరమైతే తప్ప తరగతి గదులకు ఫోన్ తీసుకు వెళ్ళవద్దని, అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ తీసుకువెళ్లాల్సి వచ్చిన అందుకు ప్రధాన ఉపాధ్యాయుడు అనుమతి తప్పనిసరి అని తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకువచ్చిన ఈ నిబంధన పాతదే అయినప్పటికీ అమలులో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుండడంతో మరోసారి ఈ మేరకు ఆదేశాలను జారీ చేసినట్లు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని నెలలపాటు సెల్ ఫోన్ వినియోగంపై నిఘా పెట్టాలని ఎంఈఓలకు తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ ఆదేశాల పట్ల ఉపాధ్యాయ వర్గాల నుంచి కాస్త విముఖత వ్యక్తం అవుతోంది. ఈ నిర్ణయం ఉపాధ్యాయులకు ఇబ్బందికరంగా మారుతుందని ప్రధానోపాధ్యాయులను వేధించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
సెల్ ఫోన్ తో కాలక్షేపం చేస్తున్న ఉపాధ్యాయులు
ఇటీవల అనేక జిల్లాల్లో కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. ఈ తనిఖీలు సందర్భంగా అధికారులకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు వెల్లడయ్యాయి. తరగతి గదుల్లో ఉన్నప్పటికీ అనేక మంది టీచర్లు ఫోన్ మాట్లాడుతూ, వాట్సప్ చాటింగ్ చేస్తూ, సోషల్ మీడియా ఖాతాలను వినియోగిస్తూ కాలక్షేపం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఎక్కువ మంది ఉపాధ్యాయులు తరగతి గదిలోనే నిముషాలు తరబడి ఫోన్లో మాట్లాడుతూ గడిపేస్తున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వచ్చాయి.
రాష్ట్రంలోని సుమారు 12 జిల్లాల నుంచి ఈ తరహా ఫిర్యాదులు రావడంతోపాటు ఉన్నతాధికారులు గుర్తించిన అంశాలను ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలను జారీ చేసింది ఉపాధ్యాయులను ఫోన్ దూరంగా ఉంచడం ద్వారా మెరుగైన విద్యా బోధనను సాగించేందుకు అవకాశం ఉంటుందని విద్యారంగాన్ని నిపుణులు చెబుతున్నారు. ఉపాధ్యాయులు ఫోన్ తో సమయాన్ని వెచ్చించడం వలన విద్యార్థులు క్రమశిక్షణ తప్పే అవకాశం ఉందని వారికి సరైన బోధన జరిగేందుకు అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు .
గూగుల్ లో అన్వేషించి పాఠాలు బోధన
కొంత మంది ఉపాధ్యాయులు పాఠశాలలకు వచ్చిన తర్వాత తరగతి గదిలోనే తాము చెప్పబోయే పాఠాలకు సంబంధించిన అంశాలను గూగుల్ లో వెతికి విద్యార్థులకు బోధిస్తున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. సాధారణంగా ఉపాధ్యాయులు ఇంటి వద్ద ఆయా అంశాలను పరిశీలించి తరగతి గదికి వచ్చి విద్యార్థులకు బోధించాల్సి ఉంటుంది. కానీ, బయట వివిధ రకాల వ్యాపకాల్లో నిమగ్నం అవుతున్న ఉపాధ్యాయులు తరగతి గదిలోనే ఆయా అంశాలను గూగుల్లో వెతికి సెల్ ఫోన్ పట్టుకొని బోధిస్తున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. దీనికి చెక్ చెప్పేందుకు తాజా ఆదేశాలు ఉపకరిస్తాయని విద్యా రంగ నిపుణులు చెబుతున్నారు.
Also Read: బాక్సర్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగం, నియామక పత్రం అందజేసిన రాష్ట్ర డీజీపీ
ముఖ్యంగా విద్యార్థులు క్లిష్టమైన ప్రశ్నలు వేసినప్పుడు ఆన్‌లైన్‌లో వెతికి ఉపాధ్యాయులు వాటిని నివృత్తి చేస్తున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. దీనివలన విద్యార్థులకు ఉపాధ్యాయుల పట్ల గౌరవం కూడా సన్నగిల్లుతున్నట్లు భావిస్తున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం సెల్ ఫోన్ లేకుండానే ఉపాధ్యాయుడు తరగతి గదికి వెళ్లే స్పష్టమైన ఆదేశాలను ప్రభుత్వం విద్యాశాఖ అధికారులకు ఇచ్చింది.
అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయ వర్గాలు
ప్రభుత్వం ఫోన్ తీసుకెళ్లకూడదంటూ ఆదేశాలు జారీ చేయడం పట్ల ఉపాధ్యాయ వర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. టీచర్లు వ్యక్తిగత ప్రయోజనాలకు సెల్ ఫోన్ వాడుతున్నారనేది అర్థం లేని వాదన అంటూ పలువురు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులకు పంపించే అన్ని రిపోర్టులను సెల్ ఫోన్ లేదా ట్యాబ్ ద్వారానే పంపించాల్సి ఉంటుందని, అత్యాధునిక టెక్నాలజీ వాడమని ప్రభుత్వాలే చెబుతున్నాయని, ఇటువంటి సమయంలో సెల్ ఫోన్ వాడకుండా ఉపాధ్యాయులు చేయాల్సిన అనేక పనులను పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడుతోందని ఉపాధ్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి.
సెల్ ఫోన్ నిషేధం కంటే స్వీయ నియంత్రణతోనే మెరుగైన ఫలితాలు ఉంటాయన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. బోధనకు ఇబ్బంది కలుగకుండా ఫోన్ వినియోగించుకోవడంపై ఉపాధ్యాయుల దృష్టిసారించాలని పలువురు సూచిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఆదేశాలు ప్రస్తుతం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Also Read: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా