Cantonment Elections: దేశ వ్యాప్తంగా అన్ని కంటోన్మెంట్ ఎన్నికలు వాయిదా, నోటిఫికేషన్ రద్దు
Secunderabad Cantonment Elections Postpone: దేశవ్యాప్తంగా అన్ని కంటోన్మెంట్ బోర్డుల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికల నిర్వహణపై గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం.
Cantonment Board Elections: దేశవ్యాప్తంగా అన్ని కంటోన్మెంట్ బోర్డుల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికల నిర్వహణపై గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ (SCB) సహా దేశ వ్యాప్తంగా 57 కంటోన్మెంట్ బోర్డులకు ఏప్రిల్ 30 న ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. తాజా నిర్ణయంతో ఎన్నికలు వాయిదా వేశారు.
ఏప్రిల్ 30న ఎన్నికలు నిర్వహించడానికి గతంలో నోటిఫికేషన్ వచ్చింది. కానీ తాజాగా ఎన్నికలు వాయిదా వేస్తూ ఎలక్షన్ నోటిఫికేషన్ ను కేంద్రం రద్దు చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో మొత్తం ఎనిమిది వార్డులు ఉన్నాయి. 2019 రిజర్వేషన్ ప్రకారం అందులో 2, 5, 6 వార్డులు మహిళలకు రిజర్వ్ చేశారు. అయితే వార్డులు- 1, 3, 4, 7 జనరల్ కేటగిరీకి ఇచ్చారు. షెడ్యూల్డ్ కులాలకు 8వ వార్డ్ రిజర్వ్ చేశారు. అయితే ఈ ఏడాది ఎన్నికలు ఫ్రీ సింబల్స్ ఆధారంగా జరుగుతాయని, వార్డుల రిజర్వేషన్ గతంలో మాదిరిగా ఉంటుందని కంటోన్మెంట్ బోర్డు అధికారులు ధృవీకరించారు.
2015 నుంచి 2020 వరకు పదవీకాలం పూర్తయ్యాక కంటోన్మెంట్ బోర్డు పదవీకాలం మరో మూడేళ్లపాటు పొడిగించడం తెలిసిందే. అనంతరం ఇటీవల విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్ పై SCB అధికారుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది అధికారులు నోటిఫికేషన్‌ను అంగీకరించారు. మరికొందరు కంటోన్మెంట్ బోర్డును (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) GHMC లో విలీనం చేయాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల ప్రక్రియ ఆలస్యమవుతుందని ప్రచారంలో ఉంది.
ఇటీవల కంటోన్మెంట్ బోర్డు ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, ఇతర కంటోన్మెంట్ బోర్డులతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు కేంద్ర రక్షణ శాఖ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులోని కొన్ని ప్రాంతాలను జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురావాలని, నగర కార్పొరేషన్ లో కలపాలన్న ప్రతిపాదన ఇప్పటికే ఆలస్యం అయిందని ఓపెన్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు చెందిన చంద్రశేఖర్ శంకరన్ అన్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఓటర్ల నమోదుకు మార్చి 4తో తుది గడువు ముగిసింది. మార్చి 23న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. నోటిఫికేషన్ ప్రకారం మార్చి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 6న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నారు. ఏప్రిల్ 10న అభ్యర్థులకు గుర్తులను కేటాయించనున్నట్లు SCB సీఈవో మధుకర్ నాయక్ ఇటీవల వెల్లడించారు.