KTR Comments On Govt: ఇప్పుడుంది అసలు ఆట - కాంగ్రెస్ పాలకులనపై కేటీఆర్ సీరియస్ కామెంట్స్
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్... తెలంగాణ ప్రభుత్వాన్నిటార్గెట్ చేశారు. లెక్కలు వేసుకుని హామీలు ఇస్తారా ? హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా? అని నిలదీశారు.
బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్(Ktr)...తెలంగాణ ప్రభుత్వాన్ని (Telangana Government) టార్గెట్ చేశారు. లెక్కలు వేసుకుని హామీలు ఇస్తారా ? హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా? అని కాంగ్రెస్ (Congress) ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయన్న ఆయన, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలన్నారు. కాంగ్రెస్ పాలకులకు అసలు ఆట ఇప్పుడుందన్నారు. కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలు ఇచ్చి, ప్రజలను మభ్యపెట్టిందని విమర్శించారు. శాసనసభ ఆవరణలో మీడియాతో చిట్‌చాట్ చేసిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ పద్దులపై చర్చ జరగలేదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మాకు అప్పగించారంటూ....కొత్త కథలు చెప్తారని అన్నారు. తాము ఏటా పద్దులపై శ్వేతపత్రం విడుదల చేశామన్నారు కేటీఆర్. ప్రతి ఏడాది కాగ్ నివేదికలు ఇస్తున్నారని.. ఆడిట్ లెక్కలు తీస్తున్నారని స్పష్టం చేశారు. ఓ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 45వేల ఉద్యోగాలిస్తామన్నారని, అన్ని ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తే స్పష్టత ఇవ్వడం లేదని తెలిపారు.
రెండు గ్యారంటీ అమలు
కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేసి రాష్ట్రాన్ని సంక్షేమ రాజ్యంగా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth reddy) స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీల్లోని రెండు పథకాలైన మహలక్ష్మి, చేయూత పథకాల్ని ప్రారంభించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచింది కాంగ్రెస్. ఆర్టీసీ బస్సుల్లో సోమవారం రికార్డు స్థాయిలో ప్రయాణికుల రాకపోకలు సాగించారు. 50 లక్షల మందికి పైగా బస్సుల్లో ప్రయాణించినట్లు ఆర్టీసీ అధికారులు వివరించారు. ఆదివారం సుమారు 41 లక్షలున్న ఈ సంఖ్య, సోమవారానికి మరో 9 లక్షలు పెరిగింది. ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడం.. కార్తిక మాసం ఆఖరి సోమవారం కావడంతో మహిళలు రికార్డు స్థాయిలో బస్సుల్లో ప్రయాణాలు చేశారు. ఈ రద్దీని ముందే ఊహించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు రెగ్యులర్‌తో పాటు స్పేర్ బస్సులను నడిపించగా డ్రైవర్లు, కండక్టర్లు వారాంతపు సెలవు తీసుకోకుండా విధులు నిర్వహించారు.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతీ నెలా రూ.2,500 నగదు, పేద మహిళలకు కేవలం ₹500కే వంట గ్యాస్ సిలిండర్ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. రైతు భరోసా కింద ప్రతిఏటా రైతులతో సహా కౌలు రైతుకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలు, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పింది. వరికి మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని తెలిపింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింది ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పింది. గృహజ్యోతి పథకం కింద పథకం కింద పేదల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వనుంది. చేయూత పథకం కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య బీమా, చేయూత కింద నెలకు రూ.4 వేల పింఛన్ ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్. యువ వికాసం కింద కళాశాల విద్యార్థుల కోచింగ్ ఫీజు కోసం రూ.5 లక్షల వరకు సాయం అందిస్తామని, ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పింది.