Harish Rao: బీఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: హరీష్ రావు క్లారిటీ
Telangana News | తాను జైల్లో ఉన్న సమయంలో బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని చూడగా.. అయితే తాను అందుకు ఒప్పుకోలేదని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు.

హైదరాబాద్: బిఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుందేని, కాషాయం పార్టీలో విలీనం అవుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై మరోసారి క్లారిటీ వచ్చింది. బీఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని, రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే బిఆర్ఎస్ పోటీ చేస్తుందిని తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎన్నికలు జరిగితే 100 సీట్లతో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలోనూ రెడ్ బుక్..
21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇచ్చినట్లు ఆధారాలు చూపిస్తే రాజీనామా చేస్తా అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరారు.
సుప్రీంకోర్టుకు వెళ్లి అయిన ఏపీకి సంబంధించిన బనకచర్ల ప్రాజెక్ట్ ను అడ్డుకుంటాం. తెలంగాణ బిజెపి ఎంపీలకు రాష్ట్ర ప్రయోజనాలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ ను అడ్డుకోవాలి. బిఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే రెడ్ బుక్ లో పేర్లు రాసుకుంటాము. ఇప్పుడు చెలరేగిపోతున్న పోలిస్, ఇతర అధికారులను హెచ్చరిస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో రాబోయేది మా ప్రభుత్వమే అన్నారు. హరీష్ రావు.
వారికి మాత్రమే కాంట్రాక్టులు కట్టబెట్టిన రేవంత్ రెడ్డి
12 వేల కోట్లను రేవంత్ రెడ్డి కేవలం నలుగురు బడా కాంట్రాక్టర్లకే కట్టబెట్టారని ఆరోపించారు. ఆయనకు సన్నిహితంగా ఉండే ఒక ఎంపీ , ఒక కార్పొరేషన్ చైర్మన్ మిల్లీ మ్యాగీ తో అసభ్యకరంగా ప్రవర్తించారనీ వార్తలు వస్తున్నాయి. కనుక వెంటనే సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసి, ఆ ఆరోపణలు నిజమైతే వారి పైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం అంబేత్కర్ పేరు పెట్టిన కారణంగానే మీరు పోలిస్ కమాండ్ కంట్రోలో సమీక్షలు చేస్తున్నారా అని రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు.
కవిత లేఖతో పార్టీలో కలకలం
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆయన కూతురు, పార్టీ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ లీక్ కావడంతో గులాబీ పార్టీలో విభేదాలు వెలుగుచూశాయి. తాను జైల్లో ఉన్న సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు, లేక విలీనం గురించి బీఆర్ఎస్ పెద్దలు ఆలోచించగా.. తాను వారి ప్రతిపాదనలు అడ్డుకున్నట్లు కవిత చెప్పారు. బీఆర్ఎస్ ఎప్పటికీ ఒంటరిగా ఉండాలని, కేసీఆర్ దేవుడని ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి. కేసీఆర్ కు నోటీసులు వస్తే, ఆయనపై తీవ్ర ఆరోపణలు కాంగ్రెస్ చేస్తుంటే, బీజేపీ చేస్తున్నా గులాబీ శ్రేణులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
కవిత లేఖ లీక్ కావడం మొదలు తెలంగాణ జాగృతిని ఆమె యాక్టివ్ చేశారు. ఇకనుంచి కేసీఆర్ కు బీఆర్ఎస్ తో పాటు జాగృతి రెండు కళ్లు అని కవిత అనడం మరిన్ని అనుమానాలకు కారణమైంది. కవిత సొంత సొంపటి దిశగా అడుగులు వేస్తుంటే కేసీఆర్ మౌనంగా ఉన్నారని వినిపిస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖలు రాసే స్వేచ్ఛ పార్టీలో అందరికీ ఉందని, తమది ప్రజాస్వామ్య పార్టీ అని కేటీఆర్ ఇటీవల చెప్పారు. అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు బయటకు రావడం మంచిది కాదన్నారు. ఆ తరువాత ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు వెళ్లి కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. పార్టీ నేతలెవరూ కవిత వ్యాఖ్యలపై తొందరపడి స్పందించకూడదు అన్నారు.






















