ఫిబ్రవరిలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థుల జాబితా, కొందరు సిట్టింగ్ లకు గ్రీన్ సిగ్నల్ ?
BRS News: బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థుల కసరత్తు త్వరలో ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అభ్యర్థిత్వాల ఎంపికకు సంబంధించి అధిష్ఠానం ఇప్పటికే నేతలతో సంప్రదింపులు జరుపుతోంది.
Lok Sabha Elections 2024 : అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ఓటమి పాలయిన బీఆర్ఎస్ (BRS)...వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో (Loksabha Elections ) మెజార్టీ సీట్లు సాధించేలా వ్యూహాలు రూపొందిస్తోంది. ఎక్కువ ఎంపీ సీట్లు గెలుపొందడం సమీక్షలు మీద సమీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పటికే పార్లమెంట్ స్థానాల వారీగా సమీక్షలు చేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Ktr )...ప్రస్తుతం శాసనసభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలు ముగిసేలోపే పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది.
లోక్ సభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి అధిష్ఠానం ఇప్పటికే నేతలతో సంప్రదింపులు జరుపుతోంది. వీలైనంత వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లోక్‌సభకు పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. బీఆర్ఎస్కు చెందిన కొందరు సిట్టింగ్ ఎంపీలు పోటీ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు అంతర్గతంగా ప్రచారం సాగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని కొందరు నేతలు పార్టీ హైకమాండ్ ను కోరుతున్నారు. గతంలో అవకాశాలు రాని వారితోపాటు ఇటీవల ఓటమి పాలైన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉన్నారు. పార్టీలో లోక్‌సభ అభ్యర్థిత్వాల కోసం ఆశావహులు చాలా మంది పోటీ పడుతున్నట్లు కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. తుది నిర్ణయం మాత్రం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దేనన్నారు.
సిట్టింగ్ ల్లో కొందరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా ?
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే నెలలో వెలువడే అవకాశం ఉండటంతో...అప్పటికి పూర్తిగా సన్నద్దం కావాలని కేటీఆర్ భావిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ అధిష్ఠానం ఇప్పటికే దృష్టి సారించింది. ఆయా జిల్లాల నేతలతో పార్టీ నాయకత్వం సంప్రదింపులు జరుపుతోంది. తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీలు మళ్లీ పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. వీరిలో కొంత మందికి ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అభ్యర్థులంతా నియోజకవర్గాల్లో పని చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. కొన్ని స్థానాల్లో కొత్త వారిని బరిలోకి దించాలని పార్టీ నిర్ణయించింది. ఒకట్రెండు చోట్ల అభ్యర్థులకు సంబంధించి స్థానిక నాయకత్వం నుంచి వ్యతిరేకత వచ్చినట్లు సమాచారం. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ నాయకత్వం మంతనాలు జరుపుతోంది. ఆయా నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేటీఆర్ సమీక్షలు
మరోవైపు పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమావేశాలు ముగియడంతో ఇపుడు అసెంబ్లీ నియోజకవర్గాలపై కేటీఆర్ దృష్టి పెట్టారు. శాసనసభ నియోజకవర్గాల వారీగా జరుగుతున్న సమావేశాల్లో సిద్దిపేట, బోథ్, జూబ్లీహిల్స్, వనపర్తి, నల్గొండ అసెంబ్లీ స్థానాలపై సమీక్ష జరగనుంది. ఈ సమావేశాలన్నీ ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లోనే జరగనున్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో జరిగే సమావేశాలకు పార్టీకి సంబంధించిన కీలకనేతలను ఆహ్వానించాలని నిర్ణయించారు. సమావేశాల నిర్వహణ బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు తీసుకోనున్నారు. ఇవాళ్టీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు, లోటుపాట్లు పై పూర్తిస్థాయి సమీక్ష జరపనున్నారు కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు, కార్యకర్తలతో చర్చించనున్నారు.