Kavitha Deeksha: ఆ వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ నల్గొండ లిల్లీపుట్, నా వద్ద ఆధారాలున్నాయి: కవిత సంచలనం
BRS MLC Kalvakuntla Kavitha | తన మీద అనుచిత వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ నల్గొండ లిల్లీపుట్ లీడర్ ఉన్నాడని, దానిపై తన వద్ద ఆధారాలున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telangana News | హైదరాబాద్: ‘తన మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఒక ఇంటి ఆడబిడ్డగా భావించి రాష్ట్రవ్యాప్తంగా వాటి మీద రియాక్ట్ అయ్యారు. కానీ బీఆర్ఎస్ అన్నదమ్ముళ్లు మాత్రం ఆ వ్యాఖ్యల మీద ఎందుకు రియాక్ట్ కాలేదో ప్రజలు ఆలోచించాలని’ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. పక్కా సమాచారం ఉంటేనే తాను మాట్లాడతానని, తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించకపోవడం, ఆ వ్యాఖ్యల వెనుక పెద్ద బీఆర్ఎస్ నేత ఉన్నారని కవిత ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్ నేతలు స్పందించలేదని తాను నమ్ముతానన్నారు.
ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా..
తన వద్ద కొందర్ని పెట్టి ఇక్కడి సమాచారం లాగుతున్నాం అని చావు తెలివితేటలు చూపిస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందన్న సమాచారం తనకు కూడా వస్తుందని ఆ నేత తెలుసుకోవాలని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ బీఆర్ఎస్ నేత ఎవర్ని వెళ్లి కలుస్తున్నారు, ఏం ప్లాన్ చేస్తున్నారు, ఎంత దిగజారుడుగా వ్యవహరిస్తున్నారో తనకు మొత్తం విషయాలు తెలుసునన్నారు. ఆ నేతను ప్రోత్సహిస్తున్నది ఎవరో ప్రజలు ఆలోచించాలని కవిత అన్నారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా.. అందుకు ఇది సరైన సమయం కాదని బీసీల కోసం పోరాడే టైమ్ అన్నారు.
కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతాను. నన్ను ఒంటరిని చేసి అనుచిత వ్యాఖ్యలు చేసి ఇబ్బంది పెట్టి శునకానందం పొందవచ్చు. కానీ దేవుడున్నాడు. నా మీద చేసిన దానికి తిరిగి కొట్టే సమయం వస్తుందని నమ్ముతాను. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నల్గొండకు చెందిన ఒక లిల్లీపుట్ నాయకుడు నా మీద మాట్లాడుతున్నాడు. ఆయన వల్ల జిల్లాలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాలేదు. ఆయన సీటు చావు తప్పి కన్నులోట్టపోయిన పరిస్థితి నెలకొంది. ఏ రోజు ప్రజా ఉద్యమాలు కూడా చేసిన రికార్డు ఆయనకు లేదు. కేసీఆర్ లేకపోతే నువ్వు ఎవరు. కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ లో ఎవరికి విలువ లేదు. ప్రజలకు మనల్ని పరిచయం చేసిన నేత కేసీఆర్. అసలు మీకు తెలంగాణ ఉద్యమంతో ఏం సంబంధం ఉంది. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మా పార్టీ కండువా కప్పుకుని పదవులు అనుభవించారు. - ఎమ్మెల్సీ కవిత
లిల్లీపుట్ నాయకుడు మాటలు మాట్లాడగానే నిన్నగాక మొన్న మా పార్టీలో చేరిన చిన్న పిల్లగాడు నా మీద వ్యాఖ్యలు చేస్తున్నాడు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతావా నువ్వు. చిన్న పిల్లగాడివి చిన్నవాడిలాగే ఉండు. పెద్దవాళ్ల విషయంలో తలదూర్చకు. తెలిస్తే మాట్లాడు. లేకపోతే సైలెంట్ గా కూర్చో. నీ వెనుక చాలా మంది ఉన్నారనుకుంటున్నావు. వాళ్ల సంగతి కూడా త్వరలోనే తేల్చుతాం. అన్ని బయటపడతాయి. రాజకీయం చేయవచ్చు. కానీ ఇంత దిగజారుడు పాలిటిక్స్ అవసరమా. ఆ లిల్లిపుట్ నాయకుడి ఇంతసేపు మాట్లాడటమే ఎక్కువ. కానీ ప్రజలకు నిజాలు తెలియాలని ప్రయత్నించాం. ఇంటి ఆడబిడ్డ మీద అనుచిత వ్యాఖ్యలు చేపించారు. తరువాత బీఆర్ఎస్ నేతలు కనీసం ఆ వ్యాఖ్యలను కూడా ఖండించలేదు. - ఎమ్మెల్సీ కవిత
పార్టీ విషయాలు బయటపెట్టింది ఎవరు
కేసీఆర్ నాకు తండ్రి, రాజకీయ గురువు. మా పార్టీ అధినేత. అలాంటి ఆయనకు నా సమస్యలు, పార్టీలో ప్రస్తుత పరిస్థితిపై అంతర్గతంగా లేఖ రాశాను. ఆ లేఖను బహిర్గతం చేసి, ఎన్నో విషయాలు నేను మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు. పార్టీ విషయాలు బహిర్గతం చేసింది ఎవరు. నా చుట్టూ డ్రామాలు ఆడుతున్నది ఎవరో ప్రజలకు త్వరలోనే తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఊతమిచ్చి వేరే పార్టీ నేతలతో నా మీద అనుచిత వ్యాఖ్యలు చేయించారనడానికి నా వద్ద వందలకొద్ది ఆధారాలున్నాయి.
బీసీ రిజర్వేషన్ల కోసం కవిత 72 గంటలు దీక్ష
బీసీ రిజర్వేషన్ల ఉద్యమం కోసం 72 గంటలపాటు ఉద్యమం చేస్తామనని కవిత స్పష్టం చేశారు. మా బాధ చెప్పుకునే అవకాశం తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలి. అంతేకానీ బీఆర్ఎస్ అంటే బీజేపీ అని మాటలు మాట్లాడుతూ కాలయాపన చేస్తే బీసీల భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుందన్నారు. 72 గంటలపాటు మాట్లాడే అవకాశం ఇస్తే ఒకచోట కూర్చుని సత్యాగ్రహం చేసి మా బాధలు చెప్పుకుంటామన్నారు. దాని వల్ల కేంద్ర ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కదలిక వస్తే శాశ్వతంగా బీసీలకు ప్రయోజనం ఉంటుందన్నారు. నాయీ బ్రాహ్మణులు సైతం పెద్ద ఎత్తున దీక్షలో పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. శాంతియుతంగా తాను చేపట్టే దీక్షకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, రాష్ట్ర డీజీపీని ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత మరోసారి కోరారు.






















