MLC Kavitha: అమ్మాయిలు స్మార్ట్‌గా కాదు, స్మార్ట్‌ఫోన్ లెక్క ఉండాలి - మగపిల్లల్నీ ఇక్కడికి పిలవాలి - ఎమ్మెల్సీ కవిత
మహిళల దినోత్సవ వేడుకలకు మగ పిల్లలను కూడా పిలిస్తే వారికి కూడా అమ్మాయిలను ఎలా గౌరవించాలో తెలుస్తుందని కవిత అన్నారు.
టెక్నాలజీ నవీకరణ చెందుతున్నట్లు మహిళలు కూడా ఎప్పటికప్పుడు నవీకరణ చెందాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళలు నిరాశ చెందకుండా ప్రతి రంగంలోనూ రాణించేందుకు ప్రయత్నించాలని విద్యార్థినులకు కవిత సూచించారు. గుండ్లపోచంపల్లి మైసమ్మ గూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాల్లో మంత్రి మల్లా రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. రాజకీయాల్లోనూ మహిళలు ఆసక్తి చూపాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సభాముఖంగా తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినులు భారతదేశంలో ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలిచిన మహిళల పాత్రలను వేషధారణలో ప్రదర్శించారు.
‘‘మహిళల దినోత్సవ వేడుకలకు మగ పిల్లలను కూడా పిలిస్తే వారికి కూడా అమ్మాయిలను ఎలా గౌరవించాలో తెలుస్తుంది. అమ్మాయిలు అంటే స్మార్ట్ కాదు, స్మార్ట్ ఫోన్ లెక్క ఉండాలి. చదువుతో పాటు ఆరోగ్యం ఉండాలి. సాఫ్ట్ వేర్ అప్ డేట్ లాగా మనం ప్రతి రోజు అప్ డేట్ కావాలి. బి స్మార్ట్ బి లైక్ ఏ స్మార్ట్ ఫోన్. మన ముందు తరం వారు స్వతంత్ర భారత్ కోసం పోరాడారు. మా తరం తెలంగాణ కోసం పోరాడాం. ఇప్పుడు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోసం కొట్లాడాలి. మహిళలు సమైక్యంగా, సమన్వయంతో ఉంటే తమ హక్కుల సాధన సాధ్యమవుతుంది’’ అని కల్వకుంట్ల కవిత పిలుపు నిచ్చారు.
మల్లారెడ్డి సరదా వ్యాఖ్యలు
ఈ వేదికపై మంత్రి సీహెచ్ మల్లారెడ్డి మాట్లాడుతూ.. తన సక్సెస్ అంతా మహిళలతోనే ముడిపడి ఉందని అన్నారు. తన భార్య కల్పన, తన కోడళ్ల వల్ల తానే అన్ని వ్యాపారాలు చేయగలుగుతున్నానని అన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మరోసారి సరదా వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య తాను తుమ్మితే తుపాను వస్తోందని అన్నారు. సోషల్ మీడియాలో తానే నెంబర్ వన్‌గా ఉంటున్నానని గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా తాను గతంలో చెప్పి, సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన డైలాగ్‌లు చెప్పారు. ‘‘పాలమ్మినా.. పూలు అమ్మినా.. కాలేజీలు పెట్టిన, మెడికల్ కాలేజీలు పెట్టిన’’ అని చెప్తూ అక్కడి యువతులను ఉత్సాహపర్చారు.
‘‘గమ్మత్తేందంటే నేను పెద్ద ప్రొఫెషనల్ ని కాదు. నేను పెద్ద ఇంటలెక్చువల్ కాదు. పెద్ద విశ్లేషకుణ్ని కూడా కాదు. ఒక మామూలు సింపుల్ ఆర్డినరీ తెలంగాణ బిడ్డను. ఈ మధ్య ఏమైందంటే నేను తుమ్మితే కూడా తుపానైపోతుంది. అంత క్రేజ్ వచ్చేసింది మల్లన్నకు. ఎందుకు వచ్చింది? దీని బ్యాక్ గ్రౌండ్ ఏంది? దీని సీక్రెట్ ఏంది? ఇదంతా కూడా నేను కష్టపడ్డా.. పాలమ్మినా.. కాలేజీలు పెట్టినా.. పూలమ్మినా.. వరల్డ్ క్లాస్ ఇంజినీర్లను తయారు చేస్తున్నా. వరల్డ్ క్లాస్ డాక్టర్లని తయారు చేస్తున్నా. టాప్ ఎంబీబీఎస్ స్టూడెంట్లని, పెద్ద పెద్ద సైంటిస్టులని ప్రపంచానికి తగ్గట్లుగా వారిని తీర్చిదిద్దుతున్నా. అందుకే మల్లన్నకు అంత క్రేజీ వచ్చింది. వాట్సప్, ఫేస్‌బుక్ ఎవ్వరు సూడరు. అన్ల దమ్ముంటెనే సూస్తరు. ఆ దమ్ము మల్లన్న తాన ఉన్నది. ఆ దమ్ము అంతా మీరే (విద్యార్థులు)’’ అని మంత్రి మల్లారెడ్డి సరదా వ్యాఖ్యలు చేశారు.