తెలంగాణ టెన్త్ పేపర్ లీక్‌లో బండి సంజయ్ పాత్ర- బీఆర్‌ఎస్ నేతల తీవ్ర ఆరోపణలు
తెలంగాణలో పదో తరగతి పేపర్ లీకేజీలో బీజేపీ నేతలు , బండి సజంయ్ పాత్ర ఉందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
తెలంగాణలో పేపర్ లీకేజీలో బీజేపీ పాత్ర ఉందని ఆరోపించారు మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుపై ఘాటుగా స్పందించిన జగదీష్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. పేపర్ లీకేజీల వెనుక బండి సంజయ్ పాత్ర ఉందని ఆరోపించారు. రాజకీయ కుట్రలో భాగంగానే లీకేజీలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్తుల జీవితాలతో ఆడుకోవడం ఏంటని ప్రశ్నించారు మంత్రి. అధికారం కోసం ఎంత దారుణానికైనా బీజేపీ దిగజారుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వాళ్లు ఎక్కడో చోట దొరికిపోతారని అలానే బండి సంజయ్ దొరికారని అన్నారు. అసలు ఆయనకు చదువు విలువ, విద్యార్థుల భవిష్యత్‌పై బెంగ లేదన్నారు. అందుకే ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి లీకేజీ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మరిన్ని విషయాలు త్వరలోనే బయటకు వస్తాయన్నారు.
పేపర్ లీక్ విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. pic.twitter.com/kwDHlHs7e0
— Jagadish Reddy G (@jagadishBRS) April 5, 2023
తెలంగాణలో ఏ పేపర్ లీక్ అయినా దాని వెనుక బండి సంజయ్ హస్తం ఉంటుందన్నారు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు. రాజకీయల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. పేపర్ లీక్ చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదని అన్నారు. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని.. యువత కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉత్తరాదిలో చేసినట్టు తెలంగాణలో చేస్తామంటే కుదరదని అన్నారు.
రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా బండి సంజయ్ తీరుపై మండిపడ్డారు. పదోతరగతి పేపర్ లీక్ సూత్రదారి ఆయనేనన్నారు. అన్ని రకాల ఆధారాలు లభించాయని తెలిపారు. లక్షల మంది పిల్లలు భవిష్యత్తు, వారి తల్లిదండ్రుల ఎంత బాధ పడతారు అని కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించారన్నారు. కేసిఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే బీజేపీ ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్ కి ఫోటో తీసిన పేపర్ ఫోన్లో పంపిండారన్నారు. పరీక్ష మొదలైన 15 నిమిషాల్లోనే బండి సంజయ్‌కు ప్రశాంత్ ద్వారా వచ్చిందని తెలిపారు.
బండి సంజయ్, బీజేపీ వాళ్ళతో 140 సార్లు ప్రశాంత్ మాట్లాడారన్నారు. వాళ్లే ఉద్దేశ పూర్వకంగా లీక్ చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్లే మీడియాకి పంపించారన్నారు. పేపర్ లీక్ అయ్యింది... తనకు వచ్చిందని.. ప్రభుత్వం విఫల మైందని చేశారన్నారు. ఇది పిల్లల జీవితాలతో చెలగాటం ఆడటమేనన్నారు. బండి సంజయ్ పాత్ర ఉందని పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నట్టు పేర్కొన్నారు. బండి అరెస్ట్ పై బీజేపీ నాయకులు కేసిఆర్ దిష్టి బొమ్మ దహనం చేస్తే భౌతిక దాడులు తప్పవని హెచ్చరించారు.