Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Hyderabad News: వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి కేసులో కేటీఆర్‌ను అరెస్టు చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో బీఆర్‌ఎస్ నేతలు, పార్టీ శ్రేములు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.
KTR Name In Lagacharla Case: వికారాబాద్ జిల్లా కలెక్టర్‌తోపాటు ఇతరులపై జరిగిన దాడి కేసు రాజకీయ సునామీ సృష్టిస్తోంది. ఈ కేసులో సహకరించారని కేటీఆర్ పేరు ప్రస్తావనకు రావడంతో గంటల వ్యవధిలోనే భారీగా కార్యకర్తలు హైదరాబాద్‌లోని నందినగర్‌కు చేరుకున్నారు. ఆయనను అరెస్టు చేస్తారన్న ప్రచారంతో శ్రేణులు కేటీఆర్ ఇంటికి చేరుకొని సంఘీభావం ప్రకటించారు. అరెస్టును అడ్డుకుంటామని నినాదాలు చేశారు.
అర్థరాత్రి భారీగా చేరుకుంటున్న కార్యకర్తలను కేటీఆర్ పలకరించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా న్యాయపరంగా ఎదుర్కుంటామని అన్నారు. తనపై అభిమానంతో అక్కడకు వచ్చిన వారిందర్నీ పేరు పేరున విష్ చేశారు. ఇంటికి వెళ్లిపోవాలని కేటీఆర్ చెప్పినా వెళ్లేందుకు మాత్రం వాళ్లు అంగీకరించలేదు.
ఎలాంటి వారంటీలు, నోటీసులు లేకుండానే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారని కార్యకర్తలు గుర్తు చేశారు. ఆయన మార్నింగ్ వాక్ చేస్తున్న టైంలోనే అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు. అందుకే ప్రభుత్వం ప్రత్యర్థులపై ఎంతటి చర్యలకైనా వెనకాడదని తాము అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు.
నీలెక్క బెడ్ రూమ్ లోకి పోయి గొళ్ళెం పెట్కొని దాస్కోలే!
— KTR News (@KTR_News) November 13, 2024
బాజాప్త నిటారుగా ఇంటి ముందు నిల్చుండు...
దమ్మున్న నాయకుడు..🔥 pic.twitter.com/nIsd1fBFaV
రాత్రి పది గంటల నుంచి కేటీఆర్ ఇంటికి వచ్చిన బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఇప్పటి వరకు అక్కడే ఉన్నారు. ఎన్ని రోజులైనా కదలమని అంటున్నారు. అక్రమ అరెస్టులతో భయపెట్టాలని ప్రభుత్వం చూస్తోందని ఇలాంటి వాటికి భయపడేది లేదంటున్నారు బీఆర్‌ఎస్ నేతలు. అసలు దాడి జరగలేదని కలెక్టర్ చెబుతుంటే ప్రభుత్వం మాత్రం కుట్ర చేశారంటూ కేసులు పెడుతోందని ఎద్దేవా చేశారు.
పట్నం నరేందర్ రెడ్డి ఫ్యామిలీని బుధవారం సాయంత్రం కేటీఆర్ కలుసుకున్నారు. అ టైంలోనే రిమాండ్ రిపోర్టు బయటకు వచ్చింది. అంతే క్షణాల్లో కేటీఆర్ అరెస్టు ఖాయమంటూ ప్రచారం జరిగిపోయింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నేతలు, అలర్ట్ అయ్యి కేటీఆర్‌కు రక్షణ చక్రంలా ఇంటికి చేరుకున్నారు. అరెస్టు లాంటివి చేస్తే మాత్రం అడ్డుకుంటామని ప్రభుత్వానికి హెచ్చరించారు.
Also Read: లగచర్ల దాడి ఘటనలో భారీ ట్విస్ట్- రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు, అవసరమైతే చంపేందుకు రెడీ!
బుధవారం సాయంత్రం పట్నం నరేందర్ ఫ్యామిలీని కేటీఆర్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... పోలీసులు రేవంత్ సైన్యంలా మారి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మఫ్టీలో వచ్చి ఓ మాజీ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆరోగ్యం బాగాలేదని చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. తమ పార్టీ నేతలతోపాటు రైతులను కూడా అరెస్టు చేసి చిత్రవధ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు అయిన వారి ఫ్యామిలీలను పరామర్శించేందుకు వెళ్తున్న వారిని కూడా అరెస్టు చేయడం ఎందుకని అన్నారు. అంతే కాకుండా భూములు ఇచ్చినట్టు అంగీకరిస్తేనే అరెస్టు చేసిన వారిని విడుదల చేస్తామంటూ పోలీసులు, సీఎం సోదరులు ఒత్తిడి చేస్తున్నారని ధ్వజమెత్తారు.