Amarnath Cloudburst: అమర్‌నాథ్ యాత్రలో నన్ను కాపాడిందే వాళ్లే- పెను ప్రమాదం తప్పిందన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
Amarnath Cloudburst:సహాయక చర్యలు శనివారం ఉదయం సైతం కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ 15000 మంది వరకు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రెస్క్యూ టీమ్ తెలిపింది.
Amarnath Cloudburst: భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రలో పెను విషాదం చోటుచేసుకుంది. దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లోని అమర్‌నాథ్ పవిత్ర క్షేత్రానికి సమీపంలో శుక్రవారం సాయంత్రం వరద బీభత్సం సృష్టించింది. ఈ విషాదంలో 15 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 35 నుంచి 40 మంది గల్లంతైనట్లు అక్కడి అధికారులు తెలిపారు.
రాజాసింగ్ వీడియో
ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇలాంటి వర్షం, వరద తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు రాజాసింగ్. ప్రమాద స్థలం నుంచి వీడియో విడుదల చేసిన ఆయన... ప్రమాదంలో తాను ఎలా బయటపడింది... అక్కడ ఏం జరిగిందో సవివరంగా తెలిపారు.
రక్షించింది వారి దీవెనలే
గోషామహల్, తెలంగాణా ప్రజల ఆశీర్వాదం వల్ల తాను క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డాను అన్నారు రాజాసింగ్. తన జీవితం లో ఇలాంటి దారుణం చూడలేదని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాము ఉన్న టెంట్లు, భోజనం చేసిన ప్లేస్ సర్వనాశనమైందని తెలిపారు. గుడికి సమీపంలో టెంట్ల క్రింద వందల మంది ఉన్నట్టు వివరించారు.
మిలటరీకి సెల్యూట్
మిలటరీ అప్రమత్తంగా ఉండటం వల్లే చాలా వరకు ప్రాణ నష్టం తగ్గిందన్నారు రాజా సింగ్. లేకుంటే భారీ విపత్తు జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు. చాపర్లు, రోడ్లు, నడక మార్గం ద్వారా దైవ దర్మనానికి చేరుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వరద తన జీవితంలో ఇంత వరకు చూడలేదన్నారు. తనను ఆశీర్వదించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు రాజాసింగ్.
ముమ్మరంగా సహాయక చర్యలు
సహాయక చర్యలు శనివారం ఉదయం సైతం కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ 15000 మంది వరకు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రెస్క్యూ టీమ్ తెలిపింది. అవసరమైన చోట హెలికాప్టర్లలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని, ముందుగా లోతట్టు ప్రాంతాల వారిని తరలిస్తున్నట్లు ఐటీబీపీ అధికారులు తెలిపారు.
మరోసారి నిలిచిన యాత్ర
వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తడంతో సోమవారం అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు బుధవారం తిరిగి ప్రారంభించారు. కానీ రెండు రోజుల వ్యవధిలో మరోసారి వరద బీభత్సం చేసి అపార ప్రాణ నష్టం కలిగించింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహయ చర్యలు కొనసాగిస్తున్నాయి. వరద నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రను మరోసారి తాత్కాలికంగా నిలిపివేశారు. తదుపరి ప్రకటన వచ్చే వరకు యాత్రను నిలిపివేస్తున్నామని అధికారులు వెల్లడించారు.