Telangana BJP: గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు.. పోలీసులు, కేసీఆర్‌పై తమిళిసైకి ఫిర్యాదు
వానాకాలం పంటను కొనకుండా రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందనే విషయాన్ని గవర్నర్ దృష్టికి బీజేపీ బృందం తీసుకెళ్లింది. ఈ భేటీలో ఈటల, రఘనందన్ సహా కీలక నేతలు పాల్గొన్నారు.
గవర్నర్ తమిళిసైతో బీజేపీ రాష్ట్ర బృందం మంగళవారం భేటీ అయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై దాడి, పోలీసుల వ్యవహారశైలిపై బీజేపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. వానాకాలం పంటను కొనకుండా రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందనే విషయాన్ని గవర్నర్ దృష్టికి బీజేపీ బృందం తీసుకెళ్లింది. ఈ భేటీలో ఈటల రాజేందర్, రఘనందన్ రావు, ఎమ్మెల్యే రాజాసింగ్, డీకే అరుణ, లక్ష్మణ్, గరికపాటి, విజయరామారావు, పొంగులేటి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ గెలుపును జీర్ణించుకోలేక టీఆర్ఎస్ దాడులు చేస్తుందని బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. భయానక వాతావరణం సృష్టించాలని చూస్తున్నారని విమర్శించారు. బెంగాల్ తరహా రాజకీయాలు తెలంగాణలో చేయాలని చూస్తున్నారని విమర్శించారు. స్వయంగా సీఎం కేసీఆర్.. బండి సంజయ్ మెడలు నరికేస్తాం, ఆరు ముక్కలు చేస్తాం అన్నారని అన్నారు. అది సీఎం స్థాయికి తగని భాష మాట్లాడుతున్నారని కొట్టిపారేశారు. సీఎం తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు.
ప్రతిపక్షాలు తప్పకుండా ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఉప ఎన్నికల్లో గెలుపు కోసం వేల కోట్లు ఖర్చు చేశారని డీకే అరుణ ఆరోపించారు. అనేక అబద్ధపు హామీలు చేసిన హుజూరాబాద్ ప్రజలు లొంగకుండా... బెదరకుండా స్పష్టమైన తీర్పు ఇచ్చారని అన్నారు. ఎన్నికలు, ఓట్లు వస్తే తప్పా సీఎం ఏం చేయలేని పరిస్థితి ఉందని ఆరోపించారు. కేంద్రంపై టీఆర్ఎస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందన్నారు.
Also Read: Vishaka: మీ కరివేపాకు ఐడియాలకు దణ్ణంరా బాబు.. అమెజాన్ లో విశాఖ టూ మధ్యప్రదేశ్ కు గంజాయి సరఫరా
కొనసాగుతున్న నిరసన సెగ
మరోవైపు, బండి సంజయ్ నల్గొండ జిల్లా పర్యటనలో రెండో రోజూ నిరసన ఎదురవుతోంది. సూర్యాపేట బస్టాండ్ వద్ద బండి సంజయ్ కుమార్ వాహనాన్ని అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించారు. కోడిగుడ్లు, టమాటాలతో దాడికి సిద్ధమైనట్లు సమాచారం. వానా కాలం పంట కొనుగోలు చేయాలని కోరితే టీఆర్ఎస్ ప్రభుత్వం దాడులు చేస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తమపై దాడులకు టీఆర్ఎస్ పార్టీ చీఫ్ అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సూత్రధారి అని అన్నారు.
బండి సంజయ్ సోమవారం నల్గొండ, మిర్యాలగూడలలో పర్యటన సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు రాళ్లు, టమాటాలు, చెప్పులు విసురుకున్నారు. బండి సంజయ్ కాన్వాయ్ పైనా దాడి జరిగిన సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను కలిసేందుకు మంగళవారం సూర్యాపేటలోని సంకినేని వెంకటేశ్వర రావు నివాసం నుంచి బయలుదేరిన బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించారు. తన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ముందుగానే పోలీసులకు ఇచ్చామని, అయినా పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు. తమ పర్యటనను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పోలీసుల తీరుపై విమర్శించారు. స్వయంగా ముఖ్యమంత్రే శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తున్నారని ఆక్షేపించారు. వానాకాలం పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనేంత వరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదని బండి సంజయ్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఫాం హౌస్ నుంచి బయటకు రావడం లేదని విమర్శించారు. సమస్యలను పరిష్కరించాలని వారే ధర్నాలకు దిగడం, దాడులకు పాల్పడటం దారుణమని అన్నారు. నిన్న టీఆర్ఎస్ చేసిన దాడిలో 8 వాహనాలు ధ్వంసమయ్యాయని చెప్పారు.
Also Read: Hyderabad: వీడియో కాల్‌లో టెంప్ట్ అయిన యువకుడు.. న్యూడ్‌గా చాట్, చివరికి దిమ్మతిరిగే ట్విస్ట్!
Also Read: పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అశ్లీల నృత్యాలు... ఇవేం పనులంటూ స్థానికుల మండిపాటు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి