Telugu CMs Meeting: తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడితే ఊరుకోం- సీఎంల భేటీపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Telangana News | తెలంగాణలోని ప్రజా భవన్‌లో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కొందరు అధికారులు ఉమ్మడి రాష్ట్ర విభజన సమస్యలపై సమావేశమై ప్రత్యేకంగా చర్చించనున్నారు.
Alleti Maheshwar Reddy | హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీని స్వాగతిస్తున్నాం, అయితే తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడితే మాత్రం ఊరుకునేది లేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. విభజన సమస్యల పరిష్కారంకు కేంద్రం సానుకూలంగా ఉందని బీజేపీ శాసనసభాపక్షనేత తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడితే చూస్తూ ఊరుకోం అన్నారు.
తెలంగాణ స్పీకర్ కనబడటం లేదు
బీఆర్ఎస్ నుంచి నెగ్గి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ సభ్యత్వాన్ని రద్దు చేయకపోతే ప్రజాస్వామ్యం పై ప్రజలకు నమ్మకం పోతుందన్నారు. దానం నాగేందర్ విషయంలో పిటిషన్ తీసుకోకుండా తెలంగాణ స్పీకర్ వ్యవహరిస్తున్నారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ కార్యాలయానికి ఎన్నిసార్లు వెళ్లినా స్పీకర్ కనపించడం లేదని, ఒకవేళ స్పీకర్‌కు రిజిస్టర్ పోస్టులో పంపిస్తే.. ఆ లెటర్స్ ను తిరిగి తమకే రిటర్న్ వస్తున్నాయని చెప్పారు. ఈ విషయంపై ప్రస్తుతం హైకోర్టులో కేసు ఉందని, అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తాం అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెంది అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. హామీల అమలుకు బదులు, వేరే పార్టీల ప్రజా ప్రతినిధుల్ని రేవంత్ తమ పార్టీలో చేర్చుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ పెద్దలు ట్యాక్సుల పేరుతో అవినీతికి పాల్పడితే వాస్తవాలతో సహా బయపెట్టామన్నారు. ముఖ్యంగా సివిల్ సఫ్లయ్ శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై కేంద్రానికి తాము ఇచ్చిన నివేదికపై త్వరలోనే విచారణ జరుగుతుందని పేర్కొన్నారు.
ఓటమి భయంతోనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లని కాంగ్రెస్
కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమి భయంతోనేపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు వెనకాడుతోందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇన్ని రోజులు పంచాయతీల్లో స్పెషలాఫీసర్ల పాలన ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా జాప్యం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి తమది ప్రజాపాలన అని చెప్పుకోవడానికి సిగ్గుందా అన్నారు. రాష్ట్రంలో పంచాయతీలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీలకు ఏడాదిన్నర నుంచి రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ. 2 వేల కోట్ల విడుదల కాలేదని ఆరోపించారు. పంచాయతీ వ్యవస్ధలో ఎన్నికైన స్ధానిక ప్రజా ప్రతినిధులు ఉంటేనే కేంద్రం నుంచి నిధులు వస్తాయన్నారు. పాలవర్గాలు లేకపోవడంతో గ్రామపంచాయతీల్లో నిధులు లేక పల్లెల్లో పనులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు సర్పంచులు అప్పులు చేసి గ్రామాల్లో పనులు చేపిస్తే.. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ప్రత్యేక అధికారులు అప్పులు చేసి అభివృద్ధి పనులు చేస్తున్నారని చెప్పారు.
పంచాయతీ సిబ్బందికి వేతనాలు లేవు
తెలంగాణలో గత ఏడు నెలలుగా పంచాయతీలకు నిధుల్లేవు మరోవైపు పంచాయతీ సిబ్బందికి వేతనాలు లేవని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. కుటుంబాన్ని పోషించడం కోసం కొందరు కూలీ పనులకు వెళ్తున్నారని తెలిపారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, కనీసం చెత్త ఎత్తేసేందుకు దిక్కులేదన్నారు. రాష్ట్రంలోని మొత్తం 12,769 గ్రామ పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి ఉందని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. కమీషన్ల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్ లతో బలవంతంగా ట్రాక్టర్లు కొనుగోలు చేయించగా.. వాటి ఈఎంఐలు కట్టేందుకు కూడా డబ్బులు లేవన్నారు. వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పులు చేసి సర్పంచ్ లు చేపించగా.. వాటికి బిల్లులు ఇంకా అందలేదన్నారు. రూ.3 లక్షల నుంచి రూ.కోటి వరకు బకాయిలు ఉన్నాయని తెలిపారు.
10 శాతం కమిషన్లు ఇస్తే తప్ప ఆర్ధిక శాఖ బిల్లులు ఇవ్వడం లేదని ఆరోపించారు. కమీషన్లు ఇవ్వకపోవడంతోనే వెయ్యి కోట్లకు పైగా ఉన్న పెండింగు బిల్లులను క్లియర్ చేయడం లేదా అని అధికారులను మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ప్రస్తుతం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 2 వేరకు ఉండగా వారికి కొన్ని నెలల నుంచి వేతనాలు అందడం లేదన్నారు. రెవెన్యూ, విద్యా శాఖ వంటి ఇతర విభాగాల్లో కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 4 నెలల నుంచి వేతనాలు ఇవ్వలేదని మండిపడ్డారు. మాజీ సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు 6 నెలల గౌరవ వేతనం పెండింగులో ఉందన్నారు.
ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ మీద ఉన్న శ్రద్ధ హామీల అమలలో లేదన్నారు. పింఛన్ పెంచుతామని ఎన్నికల హామీలు ఇచ్చారు, కానీ ప్రస్తుతం ఇచ్చే రూ.2 వేల పింఛన్ కూడా ఆలస్యంగా ఇస్తున్నారని తెలిపారు. మధ్యాహ్న భోజనం కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. సంక్షేమ పథకాలకు కూడా నిధులు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. ప్రజా పాలన కాదు పల్లెబాట పట్టి వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు.