తెలంగాణలో బీజేపీకి షాక్- కాంగ్రెస్‌లోకి వివేక్, కుమారుడు వంశీ
తెలంగాణలో బీజేపీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. పార్టీకి పెద్ద దన్నుగా ఉన్న వివేక్ రాజీనామా చేశారు. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Vivek Joins Congress Party: అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీకి వివేక్ వెంకటస్వామి రాజీనామా చేశారు. ఆయనతోపాటు కుమారుడు వంశీ కూడా రాజీనామా చేశారు. ఇద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఖర్గేతో ఫోన్‌లో మంతనాలు జరిపిన వివేక్.. రాహుల్ సమక్షంలో పార్టీలో చేరారు. నోవాటెల్ హోటల్‌లో బస చేసిన రాహుల్ గాంధీని కలుసుకున్నారు. ఆయనతోపాటు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడిన వివేక్.. తెలంగాణ రాక్షస పాలన అంతమొందించేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ప్రకటించారు. తెలంగామ ప్రజల ఆకాంక్షల మేరకు సోనియా తెలంగాణ ఇచ్చారని కానీ అవేవి నెరవేరలేదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ విజయం కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని తనకు టికెట్ ముఖ్యం కాదన్నారు.
కేంద్ర మాజీమంత్రి జి.వెంకటస్వామి రాజకీయ వారసుడిగా రాజకీయాల్లో వచ్చిన వివేక... 2009లో పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. 2014లో కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓడిపోయాక బీఆర్‌ఎస్‌లో చేరి ప్రభుత్వ సలహాదారుగా పని చేశారు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల ఓటమి కోసం ప్రయత్నించారన్న విమర్శలతో పార్టీ ఆయన్ని పక్కనబెట్టింది. బీఆర్‌ఎస్‌లో ప్రాధాన్యత లేదని వివేక్ బీజేపీలో చేరారు. అయితే, ఐదేళ్లుగా బీజేపీలో ఉన్నా సరైన ప్రాధాన్యం దక్కలేదన్న ఆవేదనతో తిరిగి... కాంగ్రెస్‌కు దగ్గరయ్యేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు వివేక్. ఇన్నాళ్లకు వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్‌లో చేరేందుకు మార్గం సుగమం అయింది. వివేక్ చేరికతో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పార్టీ బలోపేతం అవుతుందని, ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపునకు ఆయన సహకరిస్తారని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.