Bharat Bhushan Passes Away: ప్రముఖ ఫొటోగ్రాఫర్ భరత్ భూషణ్ కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం
గత కొంత కాలం నుంచి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ కన్నుమూశారు. ఆయన మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ పంతాపం ప్రకటించారు.
Bharat Bhushan Is No More: తెలంగాణ ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ (66) కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారు. వరంగల్ జిల్లాకు చెందిన భరత్ భూషణ్ ఫొటో జర్నలిస్ట్‌గా సేవలు అందించారు. క్యాన్సర్ బారిన ఆయన బసవ తారకం ఆస్పత్రిలో రేడియేషన్, కీమో చికిత్సలు తీసుకున్నారు. కానీ ఇతర అవయవాలు సైతం అనారోగ్యం బారిన పడటంతో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ప్రముఖ ఫోటోగ్రాఫర్ భరత్ భూషణ్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. తెలంగాణ ప్రజల జీవన శైలిని, సంస్కృతిని, చారిత్రక ఘట్టాలను తన ఆర్ట్ ద్వారా, ఛాయా చిత్రాల ద్వారా ప్రపంచానికి చాటిన భరత్ భూషణ్ దశాబ్దాల కృషి గొప్పదని సీఎం కేసీఆర్ అన్నారు. భరత్ భూషణ్ మరణంతో తెలంగాణ ఒక అరుదైన చిత్రకారుడు, ఫోటో జర్నలిస్ట్ ను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
భరత్ భూషణ్ మరణంతో తెలంగాణ ఒక అరుదైన చిత్రకారుడు, ఫోటో జర్నలిస్ట్ ను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
— Telangana CMO (@TelanganaCMO) January 31, 2022
గుడిమల్ల అనుసూయ, లక్ష్మీనారాయణ దంపతులకు భరత్ భూషణ్ జన్మించారు. తెలంగాణ బతుకు చిత్రాలను తన ఫొటోగ్రఫీ ద్వారా చిత్రీకరించి ఇప్పటివరకు 7 వ్యక్తిగత ప్రదర్శనలు చేశారు. తెలంగాణ ప్రజల జీవనం, వారి పరిస్థితులను తన ఫొటోల ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. బొడ్డెమ్మను, బతుకమ్మను ఎంతో అపురూపంగా చిత్రీకరించి భావి తరాలకు మన సంస్కృతి, సాంప్రదాయాలను ఫొటోల రూపంలో కళ్లకు కట్టేలా చేశారు. హరిజన్, కాంచన సీత, రంగులకళ సినిమాలకు స్టిల్ ఫొటోగ్రాఫర్ గా సేవలు అందించారు.
గతంలో పాతికేళ్ల కిందట క్యాన్సర్ బారిన పడ్డారు. ఎందో మనోధైర్యంతో మహమ్మారిని జయించిన ఆయనకు ఆరోగ్యం మళ్లీ తిరగబెట్టింది. గుండె సంబంధిత అనారోగ్యం, మధుమేహం, కిడ్నీ సంబంధిత సమస్యలు రావడంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అయినా అనారోగ్యాన్ని లెక్క చేయకుండా తన పనులు చేసుకోవడానికే సమయాన్ని కేటాయించేవారు. చావు అంటే భయపడకూడదని, ఇంకా ఎన్నో పనులు తాను చేయాల్సినవి మిగిలి ఉన్నాయని భరత్ భూషణ్ వ్యాఖ్యానించేవారు.
Also Read: Telangana: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అద్భుతమైన పీఆర్సీ, పదోన్నతులు: మంత్రులు