Drugs in Pub Party: బంజారాహిల్స్ పబ్‌లో డ్రగ్స్ వ్యవహారంలో అసలు నిందితులు వీరే, కేసులో షాకింగ్ విషయాలు బయటికి
Pudding and Mink Pub: ఏ1గా అనిల్ కుమార్, ఏ2గా అభిషేక్, ఏ3గా అర్జున్, ఏ4గా కిరణ్‌ను చేర్చారు. పబ్‌లో వెయింగ్ మెషిన్, ప్యాకింగ్ మెటీరియల్ వంటి వాటిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad Radisson Blu Hotel: హైదరాబాద్‌లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బంజారాహిల్స్ పబ్‌లో లేట్ నైట్ పార్టీ వ్యవహారంలో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. హోటల్ రాడిసన్ బ్లూ ప్లాజాలోని పుడింగ్ ఇన్ మింక్ పబ్ కేసు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు నలుగురు నిందితుల పేర్లను చేర్చారు. వీరు లేట్ నైట్ పార్టీలు చేస్తూ, పబ్‌లో డ్రగ్స్ సప్లై చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో నిందితులుగా మహదారం అనిల్ కుమార్ (35), పార్టనర్ అభిషేక్ ఉప్పాల (35), అర్జున్ వీరమాచినేని అనే పేర్లు నమోదయ్యాయి. ప్రస్తుతం వీరిలో ఇద్దరు మాత్రమే పోలీసుల అదుపులో ఉన్నారు. అర్జున్ విరమాచినేని పరారీలో ఉన్నారు. అనంతరం ఎఫ్ఐఆర్‌లో పోలీసులు కిరణ్ రాజ్ అనే వ్యక్తి పేరు కూడా చేర్చగా.. ఇతను కూడా పరారీలో ఉన్నారు. వీరిద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. సోమవారం మధ్యాహ్నం అరెస్టయిన ఇద్దరిని పోలీసులు రిమాండ్‌కు తరలించనున్నారు.
వీరిలో ఏ1గా అనిల్ కుమార్, ఏ2గా అభిషేక్, ఏ3గా అర్జున్, ఏ4గా కిరణ్‌ను చేర్చారు. పబ్‌లో టిష్యూ పేపర్లు, స్ట్రాలు, వెయింగ్ మెషిన్, ప్యాకింగ్ మెటీరియల్ వంటి వాటిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ పబ్ పార్టీలో దొరికిపోయి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపిన వారిలో గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు, నటి నిహారిక కొణిదెల ప్రధానంగా కనిపించారు. వీరు కాక, తెలంగాణకు చెందిన ఓ మాజీ ఎంపీ కుమారుడు, ఏపీకి చెందిన ఎంపీ కుమారుడు, ఒక మాజీ డీజీ స్థాయి అధికారి కుమార్తె కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని పోలీసులే తమ రక్షణలో ఉంచి బయటకు పంపినట్లు తెలిసింది.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోపలికి మీడియాను అనుమతించలేదు. లోపల ఉన్నవారు మీడియా కంటబడతామనే ఉద్దేశంతో అనుమతించనట్లుగా తెలిసింది. పట్టుబడ్డ 150 మందిలో చాలా మంది వీకెండ్ పార్టీ కోసమే వచ్చినా, వారిలో చాలా తక్కువ మంది డ్రగ్స్‌కు అలవాటు పడ్డవారు ఉన్నారు. ఆకస్మిక దాడుల్లో డ్రగ్స్ కూడా దొరకడంతో ఆ సమయంలో ఉన్న అందర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరెవరు మత్తు మందులు వాడారన్నది కచ్చితంగా నిర్ధారణ కాలేదు. వాటిని సరఫరా చేసిన వారు దొరకడంతో ఎవరి కోసం తెచ్చారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు ఎవరి పేర్లు చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది.
లోనికి వెళ్లాలంటే రిజిస్ట్రేషన్
ఈ పబ్‌లోనికి ప్రత్యేక యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి మాత్రమే పబ్‌లోకి అనుమతి లభిస్తుంది. పబ్ మేనేజర్ అనిల్‌కుమార్ కనుసన్నల్లో డ్రగ్స్ వ్యవహారం జరుగుతున్నట్టు తెలుస్తోంది. పార్టీల్లో ఉపయోగించే ఎల్‌ఎస్‌డీ, హెరాయిన్, ఎండీఎంఏ వంటివాటిలో ఏది కావాలి అనే వివరాలను ఎంత మోతాదు కావాలనే వివరాలను రిజిస్ట్రేషన్ సందర్భంగా యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుందని పోలీసులు గుర్తించారు. ఫోన్‌కు వచ్చిన ఓటీపీని పబ్‌లో ఎంట్రీ సందర్భంగా ఇవ్వాల్సి ఉంటుందని గుర్తించారు. పరారీలో ఉన్న అర్జున్ వీరమాచినేని కోసం పోలీసులు రెండు బృందాలుగా వెతుకుతున్నారు.