Bandla Ganesh: శ్రీకృష్ణుడికే జైలు జీవితం తప్పలేదు, చంద్రబాబు మళ్లీ రాష్ట్రాన్ని ఏలతారు - బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు
చంద్రబాబు అరెస్టు అయితే ఏపీలోని సొంతూర్లకు వెళ్లి ధర్నా చేయకుండా కేబీఆర్ పార్కుల వద్ద, ఔటర్ రింగ్ రోడ్డుపైన ధర్నాలు చేయడం ఏంటని బండ్ల గణేష్ ప్రశ్నించారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు కావడంపై నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. నేడు (సెప్టెంబరు 19) కేబీఆర్ పార్కు ముందు చంద్రబాబు అభిమానులు, మద్దతుదారుల నిరసన జరిగింది. ఇందులో నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టు విషయంలో తనదైన శైలిలో స్పందించారు.
చంద్రబాబు అరెస్టు అయితే, ఏపీలోని సొంతూర్లకు వెళ్లి ధర్నా చేయకుండా కేబీఆర్ పార్కుల వద్ద, ఔటర్ రింగ్ రోడ్డుపైన ధర్నాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. నాన్న లేదా అమ్మ అరెస్టు అయితే, ఇలాగే దూరాన ఉండి నిరసనలు చేస్తారా అని ప్రశ్నించారు. కారాగార జీవితం శ్రీక్రిష్ణుడికే తప్పలేదని.. రాముడికే అరణ్యవాసం తప్పలేదని అన్నారు. అలాంటిది చంద్రబాబుది ఏముందని అన్నారు. తాను పక్కా కాంగ్రెస్ నేతను అని, అయినా చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని బండ్ల గణేష్ అన్నారు.
‘‘మనకి పుట్టిన ఊళ్లు లేవా? అక్కడికి వెళ్దాం పదండి. నిరసనలు చేస్తే చంపుతారా? చచ్చిపోదాం. పుట్టుకను ఎంత ప్రేమిస్తామో, చావును కూడా అంత ప్రేమించినప్పుడే నిజమైన బతుకు. మనకి దేవుడు లాంటివాడు, మన జాతికి పెద్ద, మన రాష్ట్రాన్ని 14 ఏళ్లు పరిపాలించినవాడు, విజనరీ అయిన చంద్రబాబు రాజమండ్రి జైల్లో మగ్గుతుంటే అన్నం ఎలా తినబుద్ది వేస్తుందో! హైదరాబాద్‌లో ఎంతో మంది చంద్రబాబును అడ్డం పెట్టుకొని, ఆయన విజన్‌తో లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నారు. అయినా ఎవరికీ చలనం లేదు. నిజంగా చెప్తున్నా నేను కాంగ్రెస్ పార్టీ. కానీ, చంద్రబాబు గారు అరెస్ట్ అవడాన్ని నేను ఖండిస్తున్నా.
పండగ చేసుకోలేదు
భువనమ్మ గారితో నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆవిడ నా తల్లి లాంటిది. చంద్రబాబు అరెస్టు అయ్యారని నేను వినాయక చవితి పండుగ కూడా చేసుకోలేదు. చాలా బాధతో మాట్లాడుతున్నా. తెలుగు దేశం పార్టీ అభిమానులు కూడా చీము, నెత్తురు ఉంటే సొంతూర్లకు వెళ్దాం పదండి. మీ నాన్నకే ఇలా జరిగితే మీ అమ్మకే ఇలా జరిగితే, కేబీఆర్ పార్కులో ఔటర్ రింగ్ రోడ్డులో కూర్చొని జెండాలు ఊపుదామా? ఏం మాట్లాడతన్నారు? చంద్రబాబు మళ్లీ రాష్ట్రాన్ని ఏలతారు. దేశాన్ని శాసిస్తారు. ఏం పరవాలేదు. కారాగార జీవితం శ్రీక్రిష్ణుడికే తప్పలేదు. రాముడికే అరణ్యవాసం తప్పలేదు. చంద్రబాబుది ఏముంది సర్’’ అని బండ్ల గణేష్ మాట్లాడారు.
Thankyou for speaking up @ganeshbandla Garu !! #APvsJagan#IAmWithBabu pic.twitter.com/4qU828SHeh
— iTDP Official (@iTDP_Official) September 19, 2023