(Source: ECI/ABP News/ABP Majha)
Bandi Sanjay: మరమనిషి అనడం తప్పా? మరో కుట్రకు కేసీఆర్ యత్నాలు: బండి సంజయ్
‘‘అసెంబ్లీ బయట మర మనిషి అన్నందుకే మీకు అంత కోపం వస్తే.. అసెంబ్లీలో దేశ ప్రధాని మోదీని తెలంగాణ సీఎం కేసీఆర్ ‘ఫాసిస్టు ప్రధాని’ అంటే మాకు కోపం రాదా?’’ అంటూ బండి సంజయ్ నిలదీశారు.
ఈటల రాజేందర్ ను సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని వాళ్ళనే మరమనిషి అంటారని బండి సంజయ్ అన్నారు. హామీలను అమలు చేయలేని వాళ్లను మరమనిషి అనడం తప్పా? అంటూ ఎదురు ప్రశ్నించారు. నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ మంగళవారం (సెప్టెంబరు 13) మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్ ను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
‘‘అసెంబ్లీ బయట మర మనిషి అన్నందుకే మీకు అంత కోపం వస్తే.. అసెంబ్లీలో దేశ ప్రధాని మోదీని తెలంగాణ సీఎం కేసీఆర్ ‘ఫాసిస్టు ప్రధాని’ అంటే మాకు కోపం రాదా?’’ అంటూ బండి సంజయ్ నిలదీశారు.
అసెంబ్లీలో ప్రజా సమస్యలను చర్చించాల్సిన చోట.. రాజకీయాలను చర్చిస్తున్న కేసీఆర్ ను ఏమనాలని ప్రశ్నించారు. శాసనసభ వేదికగా ఫాసిస్టు ప్రధాని అని వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. ‘‘కేసీఆర్ కు ప్రజలే బుద్ధి చెబుతారు. కేసీఆర్ కు అసెంబ్లీని నడిపే అర్హత లేదు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే.. మాలో ఒక ఎమ్మెల్యేని ఇప్పటికే జైలుకు పంపించాడు. ఇప్పుడు మరో ఎమ్మెల్యేని సభ నుంచి సస్పెండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఇచ్చిన వాగ్దానాలను కూడా నెరవేర్చలేదు.
ఆర్టీసీ ఆస్తుల లీజుకు కుట్ర - బండి సంజయ్
‘‘ఆర్టీసీ ఆస్తులను 99 ఏళ్ల పాటు లీజుకిచ్చి, లబ్ధి పొందే కుట్రకు కేసీఆర్ తెర లేపారు. ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. ఆర్టీసీ కార్మికులకు బెనిఫిట్స్ ఇవ్వకుండా.. వాళ్ల ఉసురు తీసుకుంటున్నాడు. ఇక్కడ బస్టాండ్ నిర్మిస్తానన్న వాగ్దానం ఏమైంది? పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల హామీ ఎక్కడికి పోయింది?’’ అని బండి సంజయ్ ప్రశ్నించారు.
‘‘కేసీఆర్‌కు అసెంబ్లీకి పోయే అర్హత లేదు. సంస్కార హీనంగా మాట్లాడావు. రాబోయే రోజుల్లో స్పీకర్ నిన్ను (కేసీఆర్) సస్పెన్షన్ చేసే రోజులు వస్తాయి. అసెంబ్లీలో పేదల సమస్యల గురించి చర్చించు. అంతేకానీ, రాజకీయాలు మాట్లాడతారా?
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో పర్యటన
నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ మంగళవారం (సెప్టెంబరు 13) మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. నేడు చంద్రగిరి నగర్, శ్రీనివాస్ నగర్ లాస్ట్ బస్టాప్, జగద్గిరి గుట్ట, రంగారెడ్డి నగర్, అస్టెస్టార్స్ కాలనీ, చిత్తారమ్మ గుడి, వెంకట్రావు నగర్, కూకట్ పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ వరకూ బండి సంజయ్ యాత్ర కొనసాగుతుంది.
సస్పెన్షన్ పై ఈటల స్పందన
స్పీకర్ తనకు తండ్రి లాంటి వ్యక్తి అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అయితే సభలో మాట్లాడే హక్కు లేదా అని ఈటల ప్రశ్నించారు. శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెబితే సభలో కొనసాగవచ్చునని, ఈటలకు సూచించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. సభలో ఉండటం కంటే బయటకు వెళ్లి రచ్చ చేయాలనే ఆలోచనతో వచ్చారని మంత్రి ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) ఆరోపించారు. తనను సభలో కొనసాగించాలనుకుంటున్నారా, బయటకు పంపించాలని ముందే నిర్ణయించుకున్నారా అంటూ ఈటల గట్టిగా నిలదీశారు.
ఇదెక్కడి కథ, ఇవేం బెదిరింపులు
సభా గౌరవాన్ని కాపాడాలని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సైతం ఎమ్మెల్యే ఈటలను కోరారు. తండ్రిగా సంభోదించారని, చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని కోరగా క్షమాపణ చెప్పేందుకు ఈటల నిరాకరించారు. తనకు గౌరవ ఉందా లేదా మీరు ఎలా డిసైడ్ చేస్తారంటూ వాదనకు దిగారు ఈటల. ఇదెక్కడి కథ, ఇవేం బెదిరింపులు.. మా హక్కులు కాపాడతరా లేదా అని ఈటల సభలో అడిగారు. బీజేపీ ఎమ్మెల్యేలకు సభలో మాట్లాడే హక్కు లేదా అని స్పీకర్ పోచారంను ప్రశ్నించారు. దాంతో ఈటలను సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టగా స్పీకర్ పోచారం.. బీజేపీ ఎమ్మెల్యే ఈటలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 8వ సెషన్ మూడో మీటింగ్ ముగిసేవరకు ఈటలను సస్పెన్షన్ వేటు వేసినట్లు స్పీకర్ పోచారం ప్రకటించారు.