Avon Defence Systems: రక్షణ రంగంలో హైదరాబాద్ జోరు - ఫెసిలిటీ సెంటర్ ప్రారంభించిన ఎవాన్ డిఫెన్స్ సిస్టమ్స్
TSIIC Hardware Park in Shamshabad: హైదరాబాద్ అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది. రక్షణ, అంతరిక్షానికి సంబంధించిన ఎన్నో ఆవిష్కరణలు చేసేందుకు ఎవాన్ డిఫెన్స్ సిస్టమ్స్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభించింది.
రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో ప్రైవేట్ పరిశ్రమలు దూసుకువస్తున్నాయి. ప్రత్యేకించి హైదరాబాద్ కేంద్రంగా ఇటీవలి కాలంలో పలు ప్రైవేట్ సంస్థలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. సిస్టమ్స్ మెకానికల్ డిజైన్, సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ లో పేరుగాంచిన Avon Defence Systems Pvt Ltd హైదరాబాద్ లో తమ సంస్థ తయారీ ఉత్పత్తి నిర్వహణ కేంద్రాన్ని ప్రారంభించింది. శంషాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TSIIC) హార్డ్ వేర్ పార్క్ లో 5వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సంస్థ కార్యాలయాన్ని తయారీ కేంద్రాన్ని విస్తరించింది. రక్షణమంత్రిత్వశాఖ మాజీ సైంటిఫిక్ అడ్వైజర్, డీఆర్డీవో మాజీ ఛైర్మన్ డా.జి.సతీష్ రెడ్డి Avon Defence Systems కొత్త ఫెసిలిటీ సెంటర్ ను ప్రారంభించారు. సంస్థ నిర్వాహకులను, ఉద్యోగులను అభినందించి శుభాకాంక్షలు తెలియచేశారు.
ఈ సంస్థ ద్వారా రక్షణ రంగానికి సంబంధించిన ఉత్పత్తుల తయారీ స్థానికంగానే జరగనుంది. హై యాక్సురెసీ మెకానికల్ ఫ్యాబ్రికేషన్, ఇంటిగ్రేషన్, పవర్ కన్వర్టర్స్ డిజైన్ వాటి తయారీ, స్ట్రాటజిక్ పేలోడ్స్ తో పాటు UAV ల ఇంటిగ్రేషన్ ను ఈ ఫెసిలిటీ ద్వారా చేపట్టనున్నారు.శంషాబాద్ లో ఏర్పాటైన Avon Defense Systems సంస్థ ద్వారా రానున్న 18-24 నెలల కాలంలో తెలంగాణలో 150మంది సాంకేతిక నిపుణులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి, దేశీయ రక్షణ రంగ వ్యవస్థకు ఈ కొత్త ఫెసిలిటీ సెంటర్ వేదిక అవుతుందని సంస్థ సీఈవో, సహ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ రెడ్డి అలినేని అన్నారు.
" రక్షణ రంగానికి సంబంధించిన లెక్కల ప్రకారం 2016-17లో మన దేశం చేస్తున్న రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతి విలువ రూ.1521కోట్లు కాగా అది 2022-23నాటికి రూ.15,920కోట్లకు చేరుకుంది. అంటే దాదాపుగా రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతిలో మన దేశం పదిరెట్ల అభివృద్ధిని ఆరేళ్ల కాలంలోనే చూసింది. దేశీయంగా రూపుదిద్దుకునే వస్తువుల ఉత్పత్తిని అన్ని రంగాల్లో ప్రోత్సాహించాలన్న కేంద్రం ఆలోచనలకు ఇది సంకేతం. మా సంస్థ ద్వారా రక్షణ రంగంలో అలాంటి సహకారాన్ని అందించగలుగుతాం " - శ్రీకాంత్ రెడ్డి అలినేని, CEO - Avon Defense Systems Pvt Ltd.
"రానున్న 18-24 నెలల కాలానికి నిర్దిష్టమైన ప్రణాళికలను సిద్ధం చేసుకుని అందుకు తగినట్లుగా కృషి చేస్తున్నాం. పవర్ కన్వర్టెర్స్, ఎలక్ట్రో మెకానికల్ గింబల్స్ తయారీలో, సరికొత్త డిజైన్ల రూపకల్పనలో విన్నూత్నంగా ముందుకు వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం." _ రఘువీర్ రెడ్డి, CTO - Avon Defense Systems pvt Ltd