TRS Vs BJP: జేపీ నడ్డాను ఉరికించి కొడతాం, చిల్లర మాటలు మాట్లాడితే ఉన్నదీ పోతుంది: జీవన్ రెడ్డి వ్యాఖ్యలు
ఢిల్లీ నుంచి బీజేపీ లీడర్లు వచ్చి.. ఇక్కడి గల్లీ లీడర్లు రాసిచ్చింది చదువుతున్నారని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అసెంబ్లీలోని శాసనసభాపక్ష కార్యాలయంలో బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటనపై టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. బుధవారం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జేపీ నడ్డాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జేపీ నడ్డా పచ్చి అబద్ధాల బిడ్డ అని జీవన్ రెడ్డి అన్నారు. అబద్ధమనే ఫ్యామిలీకి పెద్ద బిడ్డ నడ్డా అని విమర్శించారు. ముందు ఆయన ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవాలని ఎద్దేవా చేశారు. జేపీ నడ్డా సీఎం కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పాలని, లేకుంటే బెంగాల్‌లో మాదిరిగా ఉరికించి కొడతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిల్లర మాటలు మాట్లాడితే.. ఉన్న మూడు సీట్లు కూడా పోతాయని అన్నారు. బీజేపీ నాయకులు మతి కోల్పోయి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్, ఎంపీ అరవింద్‌పై పీడీ యాక్ట్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ నుంచి బీజేపీ లీడర్లు వచ్చి.. ఇక్కడి గల్లీ లీడర్లు రాసిచ్చింది చదువుతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలోని శాసనసభాపక్ష కార్యాలయంలో జీవన్ రెడ్డి బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడారు.
బిడ్డా నడ్డా.. తెలంగాణలో నీ నకరాలు ఇక్కడ నడవవు అంటూ జీవన్ రెడ్డి హెచ్చరించారు. రూ.50 వేల కోట్లతో మిషన్ భగీరథ చేపట్టారని, అయినా ఒక్క ఊర్లోనూ నీళ్లు రావడం లేదని నడ్డా అబద్ధాలు మాట్లాడడం కరెక్టు కాదని అన్నారు. బీజేపీ నేతలు ఏ ఊరికైనా వెళ్దామని, ఇంటింటిలో నల్లా నీళ్లు చూపిస్తామని.. మిషన్ భగీరథ నీటితో స్నానం చేపిస్తానని అన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర మంత్రులే ప్రశంసించారని చెప్పారు. నడ్డాకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అడ్డగోలు ఆరోపణలు చేశారన్నారు. ఆ ప్రాజెక్టుతో లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయని చెప్పారు. మిషన్ భగీరథ, కాళేశ్వరంపై అబద్ధాలు చెప్పిన నడ్డా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అంటే సెల్లర్స్, కిల్లర్స్ పార్టీ అని ఎద్దేవా చేశారు. వంద ఎకరాల భూమికి లక్షా 20 వేల కోట్లు పెట్టి ప్రాజెక్టు కడతారా అని విమర్శించారు. దేశంలో బీజేపీ నాయకులు ఏ టూ జెడ్ స్కాముల్లో ఉన్నారని ఆరోపించారు. గాంధీని తిడతారు, గాడ్సేను కొలుస్తారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయాలంటే పారిపోయిన వ్యక్తి కిషన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు.
Also Read: Counsellor Vs Minister: ఆ మంత్రి నన్ను హత్య చేయించేస్తాడు.. టీఆర్ఎస్ నేత సంచలనం, హెచ్చార్సీ వద్దకు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి