YS Jagan To Hyderabad: మేనల్లుడి నిశ్చితార్థానికి హాజరుకానున్న ఏపీ సీఎం జగన్
YS Sharmila YS Jagan Mohan Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ కు వచ్చి మేనల్లుడు రాజా రెడ్డి ఎంగేజ్ మెంట్ కు హాజరు కానున్నారు.
YS Jagan Mohan Reddy To visit Hyderabad: హైదరాబాద్: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ లో పర్యటించనున్నారు. సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కుమారుడి వివాహ నిశ్చితార్ధ వేడుకకు హాజరు కానున్నారు. నూతన వధూవరులు రాజా రెడ్డి, అట్లూరి ప్రియలను వైఎస్ జగన్ (YS Jagan) ఆశీర్వదించనున్నారు. గురువారం సాయంత్రం 6.15 గంటలకు వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ లో సోదరి వైఎస్ షర్మిల కుమారుడు రాజా రెడ్డి వివాహ నిశ్చితార్ధ వేడుకకు హాజరు కానున్నారు. ఎంగేజ్ మెంట్ అనంతరం తిరుగు ప్రయాణమై.. రాత్రికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని ఏపీ సీఎంవో అధికారులు తెలిపారు.
తన పార్టీ వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయకముందు తాడేపల్లి నివాసంలో సోదరుడు వైఎస్ జగన్ ను షర్మిల కలిశారు. తన కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం, వివాహ వేడుకలకు హాజరు కావాలని అన్నా వదినను షర్మిల ఆహ్వానించారు. జనవరి 18న ఎంగేజ్ మెంట్, ఫిబ్రవరి 17న రాజారెడ్డి, అట్లూరి ప్రియ వివాహం నిశ్చయించారు. ఆ సమయంలో షర్మిల వెంట భర్త అనిల్, కుమారుడు వైఎస్ రాజారెడ్డి, కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. అరగంటకు పైగా వైఎస్ షర్మిల, జగన్ సమావేశం అయ్యారు. రాజకీయాలను పక్కనపెట్టి కుటుంబ, వ్యక్తిగత విషయాలు, రాజా రెడ్డి ఎంగేజ్ మెంట్, మ్యారేజ్ గురించి చర్చించారు. అనంతరం విజయవాడలోని నోవాటెల్ హోటల్‌కు వెళ్లిన షర్మిల.. అదే రోజు రాత్రి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. మరుసటి రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిసిందే. కానీ వైఎస్ జగన్, షర్మిల భేటీకి సంబంధించిన ఫొటో మాత్రం బయటకు రాకపోవడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. ఆమె ఎక్కడికి వెళ్లి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చినా, ఆ తరువాత అందుకు సంబంధించిన ఫొటోలు బయటకు రావడం తెలిసిందే.
షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుకకు ఏపీ సీఎం జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తెలంగాణ మంత్రులు, రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు, పలువురు వ్యాపార ప్రముఖులు, కుటుంబసభ్యులు హాజరుకానున్నారని సమాచారం.