Hyderabad: పోలీసులపై మరో MIM కార్పొరేటర్ రుబాబు - ఎస్సైపై రెచ్చిపోయిన వీడియో వైరల్
భోలక్ పూర్ కార్పొరేటర్ ఘటన మరువక ముందే మరో మజ్లిస్ కార్పొరేటర్ అదే రీతిలో పోలీసులపై జులుం ప్రదర్శించారు. ఈసారి పాతబస్తీ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి ఎంఐఎం కార్పొరేటర్ రుబాబు చేశారు.
హైదరాబాద్‌లో ఎంఐఎం కార్పొరేటర్ల దౌర్జన్యం మరీ దారుణంగా ఉంటోంది. భోలక్ పూర్ కార్పొరేటర్ ఘటన మరువక ముందే మరో మజ్లిస్ కార్పొరేటర్ అదే రీతిలో పోలీసులపై జులుం ప్రదర్శించారు. ఈసారి పాతబస్తీ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి ఎంఐఎం కార్పొరేటర్ రుబాబు చేశారు. స్థానికంగా ఉన్న యునాని ఆసుపత్రి ఎదుట పార్కింగ్ భారీగా చేయడంతో స్థానికులు 100కు కాల్ చేశారు. దీంతో ఎస్సై రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు.
ఇంతలో ఎంఐఎం కార్పొరేటర్ సయ్యద్ సొహైల్ ఖాద్రి కూడా అక్కడికి వచ్చారు. అసలు మీకు ఇక్కడ ఏం పని.. ఎందుకొచ్చారంటూ ఎస్‌ఐపై నిప్పులు చెరిగారు. తమకు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తేనే వచ్చానని పోలీసులు చెప్పే ప్రయత్నం చేసినా కార్పొరేటర్ వినిపించుకోలేదు. అదే సమయంలో పోలీసులకు యునాని హాస్పిటల్ సిబ్బంది ఫోన్ చేశారని తెలిసి వారిపై సీరియస్ అయ్యారు. గట్టి గట్టిగా అరుస్తూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ పవర్ ఇక్కడ చూపిస్తామంటే నడవదని హెచ్చరించారు. ఇక్కడ ఇలాగే చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఇది రంజాన్ నెల కావడంతో రోజూ మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. ప్రార్థనలు చేసేందుకు ముస్లింలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వాళ్లందరికీ పార్కింగ్‌ను యునాని హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తుంటారు. ఈసారి అలా చేయలేదు. యునాని హాస్పిటల్ గేట్లు మూశారు. దీంతో మక్కా మసీదులో ప్రార్థనలకు వచ్చిన వాళ్లంతా ఆస్పత్రి గేటు ముందు, రోడ్లపై వాహనాలు నిలపడంతో ట్రాఫిక్ భారీగా ఆగిపోయింది.
ఈ సమయంలోనే ఫిర్యాదు అందుకున్న ఎస్సై అక్కడికి రావడం, అదే సమయంలో కార్పొరేటర్ సయ్యద్ సొహైల్ ఖాద్రి రావడంతో తాజా ఘటన చోటు చేసుకుంది. దర్పంతో విరుచుకుపడుతుండడంతో పోలీసులు కూడా గట్టిగా ఏం మాట్లాడలేకపోయారు. కాసేపు వాగ్వాదం తర్వాత పోలీసులే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
భోలక్ పూర్ కార్పొరేటర్ అరెస్టు
కానిస్టేబుళ్లను తీవ్రంగా అవమానిస్తూ దురుసుగా ప్రవర్తించిన ముషీరాబాద్ భోలక్ పూర్ కార్పొరేటర్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పోలీసులు సంబంధిత కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకున్నారు. ఆ ఘటన జరిగిన ఒకరోజుకే మళ్లీ మరో మజ్లిస్ పార్టీ కార్పొరేటర్ ఇలా ప్రవర్తించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు గానూ భోలక్ పూర్ కార్పొరేటర్ పై సెక్షన్ 350, 506 కింద కేసులు నమోదు చేశారు. అనంతరం, అతణ్ని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు.