Amit Shah Hyderabad Tour: అమిత్ షా హైదరాబాద్ టూర్ ఖరారు, భారీ సభకు ఏర్పాట్లు
ఏప్రిల్ 23న ఆయన హైదరాబాద్ కు వచ్చేలా షెడ్యూల్ ఖరారు అయింది. ఈ క్రమంలో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో భారీ బహిరంగ సభకు తెలంగాణ బీజేపీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణలో బీజేపీ రాజకీయ కార్యకలాపాలను వ్యూహాత్మకంగా, వేగంగా అమలు చేస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో అసంతృప్తితో బయటకు వచ్చిన వారిని పార్టీలో చేర్పించుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన ఖరారు అయింది. ఏప్రిల్ 23న ఆయన హైదరాబాద్ కు వచ్చేలా షెడ్యూల్ ఖరారు అయింది. ఈ క్రమంలో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో భారీ బహిరంగ సభకు తెలంగాణ బీజేపీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభలో అమిత్ షా కీలకమైన ప్రకటనలు చేస్తారని సమాచారం. అంతేకాకుండా ఈ వేదికపైనే భారీ స్థాయిలో చేరికలు ఉంటాయని ప్రచారం నడుస్తోంది.
బీఆర్ఎస్ నుంచి ఇటీవల సస్పెండ్ అయిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారెడ్డి బీజేపీలో చేరనున్నారన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారితో చర్చలు చేస్తున్నారు. అమిత్ షా వచ్చేనాటికి చర్చలు ఓ కొలిక్కి వస్తాయని భావిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత అమిత్ షా తెలంగాణలో బీజేపీ మరింత బలం సాధించేందుకు మరింత ఫోకస్ పెడతారని బీజేపీ నేతలు చెబుతున్నారు.
మరోవైపు అమిత్‌షా పర్యటన రోజే మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావు తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా హాజరు అవుతారని సమాచారం. పొంగులేటి శ్రీనివాస రెడ్డిని కాంగ్రెస్‌లో చేరాలని ఇప్పటికే రాహుల్ గాంధీ ఆహ్వానించారు. దీంతో ఆయన ఏ పార్టీలో చేరతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.