Telangana Liberation Day: ఒవైసీలంటే భయం లేదా! తెలంగాణ విమోచనా దినోత్సవం నిర్వహించండి: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Telangana to Celebrate Sept 17 as Praja Palana Day| కాంగ్రెస్ నేతలకు ఒవైసీ బ్రదర్స్ అంటే భయమని బీజేపీ ఆరోపిస్తోంది. ఏ భయం లేకపోతే తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Telangana Praja Palana Day | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఓ విషయంపై ఎప్పుడూ వివాదం నెలకొంటుంది. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచనా దినోత్సవంగా నిర్వహించాలని బీజేపీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో.. బీజేపీ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒవైసీ బ్రదర్స్, ముస్లింలతో అవసరాలు, ఓటు బ్యాంకు కోసమే తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించలేదని గతంలో బీఆర్ఎస్ పై, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.
ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచనా దినోత్సవంగా నిర్వహించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీలకు భయపడే విమోచనా దినోత్సవం నిర్వహించడం లేదా అని తన లేఖ ద్వారా ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒవైసీ బ్రదర్స్‌కు భయపడే నిర్వహించలేదు అని, అందుకే బీఆర్ఎస్ హయాంలో సమైక్యత దినోత్సవంగా నిర్వహించారని మహేశ్వర్ రెడ్డి గుర్తుచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. విమోచనా దినోత్సవానికి బదులుగా ప్రజాపాలన దినోత్సవం అంటోందన్నారు. ఏ విధంగా చూసినా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కో పేరుతో తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలను విస్మరిస్తున్నాయని విమర్శించారు.
మరో రెండు రోజులు ఉందని, ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోరారు. గతంలో హైదరాబాద్ రాజ్యంలో రాజకార్ల అరాచక పాలనను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేసిన అమరుల త్యాగాలను గుర్తించాలన్నారు. అందుకు సెప్టెంబర్ 17వ తేదీన ప్రజా పాలన దినోత్సవం అని కాకుండా, తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని సూచించారు. ఇలా చేయకపోతే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హితవు పలికారు.
ఓవైపు కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుంటే... తెలంగాణ ప్రభుత్వం విమోచనా దినోత్సవం ఎందుకు నిర్వహించడం లేదో అర్థం కావడం లేదన్నారు. బీజేపీ మాత్రం ఈసారి కూడా తెలంగాణ విమోచనా దినోత్సవ వేడుకల్ని రాష్ట్రంలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్ స్టేట్ నుంచి నుంచి విడిపోయి మహారాష్ట్ర, కర్ణాటకలో కలిసిన జిల్లాలోనూ... సెప్టెంబర్ 17న విమోచనా దినోత్సవ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. కానీ ఎంఐఎం, ఒవైసీ బ్రదర్స్ కు భయపడి తెలంగాణలో ప్రభుత్వాలు విమోచనా దినోత్సవంగా జరపడం లేదు అని ఆరోపించారు.