Fire Accident: అప్పుడే మేల్కొని ఉంటే బోయిగూడలో 11 ప్రాణాలు పోయేవి కావేమో!
ఆరు నెలల క్రితమే ప్రమాదం జరిగింది. అప్పుడే మేల్కొని ఉంటే ఇంత ఉపద్రవం జరిగి ఉండేది కాదేమో.
బోయిగూడ అగ్ని ప్రమాదంలో అనేక కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆరు నెల క్రితమే ఒక ప్రమాదం జరిగిందని అయినా యాజమాన్యం మేల్కోలేదని తెలుస్తోంది. ఇప్పుడు ప్రమాదం జరిగిన స్క్రాప్ గోడౌన్ వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగిందని, అప్పట్లో గోడౌన్ నిర్వాహకులను హెచ్చరించినా పట్టించుకోలేదని సమాచాం. అధికారులు కూడా లైట్ తీసుకోవడంతో ఇప్పుడు పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు.
సికింద్రాబాద్ సమీపంలో బోయిగూడ వద్ద స్క్రాప్ గోడౌన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా గోడౌన్ లోపలా, బయట పూర్తిగా పొగతో నిండిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు స్దానికులు ఒక్కసారిగా రోడ్లపైకి చేరుకున్నారు. మంటలు దవానలంగా వ్యాపించడంతో లోపల ఎవరు ఉన్నారనేది తెలుసుకునేందుకు, వారిని రక్షించేందకు కనీసం ప్రయత్నించలేని భయానక పరిస్దితి నెలకొంది.
ఒక్కసారిగా ఓ వ్యక్తి పై నుంచి తీవ్రంగా కాలిన గాయాలతో క్రిందకు దూకడం గమనించామని స్దానికులు చెబుతున్నారు. అలా ఏం జరింగిందో తెలుసుకునేలోపే పదకొండు ప్రాణాలు కోల్పోయారు. మాంసపు ముద్దలుగా మారారు. ఇంతలా పదకొండు మందిని బలితీసుకున్న స్క్రాప్ గోడౌన్ ఆనుకునే సరిగ్గా ఆరునెలల క్రితం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోడౌన్ కు ఆనుకుని ఉన్న షాపుల్లో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఆ మంటలు ప్రభావం ప్రక్కనున్న స్క్రాప్ గోడౌన్ కు తాకింది. అప్పట్లో ఎగసిపడిన మంటలు,పొగతో స్దానికులు భయాందోళనకు గురైయ్యారు.
మంటలు ఆర్పడం కోసం అగ్నిమాపక సిబ్బంది సైతం తీవ్రంగా శ్రమించారు. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు కానీ భారీ స్దాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయితే ఆ మంటలు నేర్పిన గుణపాఠాన్ని అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు.
పరిణామం ఇప్పుడు ఇలా ఆరునెలల తరువాత స్క్రాప్ గోడౌన్ ను తాకింది. ఇప్పుడు ఏకంగా పదకొండు మంది సజీవ సమాధి
అయ్యారు. ఆరు నెలల క్రితమే అధికారులు ఈ ప్రాంతంలో ముఖ్యంగా ప్రక్కనే ఉన్న స్క్రాప్ గోడౌన్ పై దృష్టిపెట్టి. అగ్నిప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవడం లేదా లోపల నివసించేవారిని ఖాళీ చేయించడం చేసినట్లయితే ఇప్పుడు ఈ దారుణం జరిగేది కాదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఇదే విషయంపై పలుమార్లు నిర్వాహకుడిని హెచ్చరించినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఓ నిర్లక్ష్యం ఖరీదు
పదకొండు నిండుప్రాణాలు. ఇకపైన అయినా హైదరాబాద్‌లోని స్క్రాప్ గొడౌన్లపై స్పెషల్ పోకస్ పెట్టాలనే సూచన గట్టిగా వినిపిస్తోంది.