Siva Balakrishna: శివబాలకృష్ణ కేసులో దిమ్మతిరిగే అక్రమ ఆస్తులు బయటికి! ఏకంగా 214 ఎకరాల భూమి
Shiva Balakrishna Case: అవినీతి అధికారి శివ బాలకృష్ణ బండారం తవ్వే కొద్దీ బయటపడుతూ ఉంది. ఆయన అక్రమాస్తుల చిట్టా చూసి అధికారులే నోరెళ్లబెడుతున్నారు.
HMDA Former Director Shiva Balakrishna: హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీలో (హెచ్ఎండీఏ) డైరెక్టర్ హోదాలో పని చేసి అందినకాడికి బొక్కేసిన అవినీతి అధికారి శివ బాలకృష్ణ బండారం తవ్వే కొద్దీ బయటపడుతూ ఉంది. ఆయన అక్రమాస్తుల చిట్టా చూసి అధికారులే నోరెళ్లబెడుతున్నారు. అక్రమాస్తుల వ్యవహారంలో శివ బాలకృష్ణను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు తాజాగా అతణ్ని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కేసుకు సంబంధించిన వివరాలను కోర్టులో సమర్పించారు. దీంతో కోర్టు శివ బాలకృష్ణకు 14 రోజుల రిమాండ్ పొడిగించింది. దాంతో శివ బాలకృష్ణను చంచల్ గూడ జైలుకు ఏసీబీ అధికారులు తరలించారు. అంతకు ముందు శివ బాలకృష్ణను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి.. వైద్య పరీక్షలు నిర్వహించి తర్వాత కోర్టులో హాజరుపరిచారు.
19 ఓపెన్ ప్లాట్లు, అపార్ట్‌మెంట్లలో ఏడు ఫ్లాట్లు
అయితే, శివ బాలకృష్ణ ఆస్తుల వివరాల గురించి ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర సంచలన ప్రకటన చేశారు. ఇప్పటి వరకు మొత్తం రూ.250 కోట్ల మేర అక్రమాస్తులు గుర్తించామని చెప్పారు. అలాగే ఆయనకు సంబంధించి 214 ఎకరాల భూమిని, 29 ప్లాట్లను కూడా తాజాగా గుర్తించామని అధికారులు చెప్పారు. శివ బాలకృష్ణకు తెలంగాణతో పాటు విశాఖపట్నంలోనూ పదుల సంఖ్యలో ప్లాట్లు ఉన్నాయని చెప్పారు. దాదాపు 19 ఓపెన్ ప్లాట్లు, అపార్ట్‌మెంట్లలో ఏడు ఫ్లాట్లు, 3 విల్లాలు ఉన్నాయని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర వివరించారు.
మరికొందరు అరెస్టయ్యే ఛాన్స్
అయితే, శివబాలక్రిష్ణ అక్రమాస్తుల కేసులో మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ తెలిపారు. హెచ్ఎండీలో మిగతా అధికారుల పాత్రపై కూడా తాము సమగ్రంగా దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి తాము ఇప్పటికే కీలక ఫైల్స్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. లాకర్స్ కూడా భారీగా బంగారం, పత్రాలు గుర్తించామని వివరించారు.