Medchal News: రూ.4 లక్షలకు 2 నెలల పసికందు అమ్మకం, సెంటర్ నిర్వాహకురాలి గుట్టురట్టు
నాలుగు లక్షలకు 60 రోజుల నవజాత ఆడపిల్ల అమ్మకానికి ప్రయత్నించిన ఓ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకురాలి గుట్టు రట్టయింది. దీని వెనక వేరే ఏదైనా రాకెట్ ప్రమేయముందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
60 Days baby sold for RS 4 lakh: నవ జాత శిశువులకు ధర నిర్ణయించి విక్రయిస్తోన్న రాకెట్ ను కొందరు యువతీ యువకులు ప్లాన్ ప్రకారం నిర్వీర్యం చేసిన ఘటన మేడ్చల్ జిల్లా పరిధిలో జరిగింది. ఓ 60 రోజుల పసికందును ఈ సందర్భంగా వారు కాపాడి బాలల సంరక్షణ కేంద్రానికి పంపించారు. పాప తల్లిదండ్రుల వివరాలు, దీని వెనుకున్న వారు తదితర వివరాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ముసుగులో..
మేడ్చల్ జిల్లా పీర్షాది గూడ కార్పోరేషన్ పరిధిలోని రామకృష్ణ నగర్‌లో శోభారాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకురాలు నవజాత శిశువులను విక్రయిస్తున్నారని తెలుసుకున్న కొందరు యువతీ, యువకులు.. మేడిపల్లి పోలీసులు, ఛైల్డ్ లైన్ అధికారుల సాయంతో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి ఈ రాకెట్ వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. రూ. నాలుగు లక్షలకు 60 రోజుల ఆడపిల్లను వారికి ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న శోభారాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకురాలు.. వారికి డబ్బు తీసుకుని బిడ్డను ఇచ్చే క్రమంలో పోలీసులకు చిక్కారు.
ఈ ముఠా గుట్టును రట్టు చేసిన యువతి ఈ సందర్భంగా చెప్పిన వివరాలిలా ఉన్నాయి. ‘‘శోభారాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో నవ జాత శిశువులను విక్రయిస్తున్నట్లు తెలుసుకుని ముందుగా ఈ విషయంపై వివరాలు సేకరించాం. దీనిపై నిర్వాహకులతో మాట్లాడగా మగ బిడ్డ అయితే 6 లక్షలు, ఆడబిడ్డ అయితే 4 లక్షలు.. అని చెప్పారు. అన్ని వివరాలు తీసుకుని అడ్వాన్స్ గా కొంత డబ్బు వేశాక ఈరోజు ఉదయం పాపను తీసుకోవడానికి రమ్మన్నారు. లైప్ ఆపరేషన్ చేసి బేబీని రెస్క్యూ చేశాం. పోలీసులకు, చైల్డ్ లైన్ వాళ్లకి సమాచారం ఇచ్చాం. పాప అమ్మ నాన్నలెవరో తెలీట్లేదు. వీళ్ల గ్యాంగ్ ఉందా..? వంటి వివరాలు తెలియాల్సి ఉంది. మాకు ఇచ్చేటప్పటికీ పాపకు 60 రోజులు. మొదట నుంచీ వీళ్ల దగ్గరే ఉ:దా..? 60 రోజులకు తీసుకొచ్చి మాకిచ్చారా అనే విషయాలూ తెలియరాలేదు. మేడిపల్లి పోలీసులు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు’’ అని చెప్పారు.