2 BHK Scheme Telangana: డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీపై అప్ డేట్, మరోవారంలో అందించనున్నట్లు కేటీఆర్ వెల్లడి
2 BHK Scheme Telangana: హైదరాబాద్ పరిధిలో నిర్మించి డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీని మరో వారంలో చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
2 BHK Scheme Telangana: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీని మరో వారంలో చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రగతి భవన్ లో బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన నేపథ్యంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ ప్రక్రియను జీహెచ్ఎంసీ మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే 70 వేల ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమం వేగంగా నడుస్తున్నట్లు అధికారులు మంత్రులకు వెల్లడించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ కూడా దాదాపు పూర్తి కావొచ్చిందని తెలిపారు.
బీఆర్ఎస్ సర్కారు.. జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని వేగంగా నిర్మాణం చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ నగర పరిధిలో 75 వేలకు పైగా రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ పూర్తి అయిందని వెల్లడించారు. ఇందులో సుమారు 4,500 కు పైగా ఇళ్లను లబ్ధిదారులకు అందించామన్నారు. నిర్మాణం పూర్తి చేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్న సుమారు 70 వేల ఇళ్లను ఐదారు దశల్లో వేగంగా అందిస్తామని పేర్కొన్నారు. వచ్చే వారంలో తొలి దశ డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని వెల్లడించారు. పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రక్రియ పంపిణీపైన మంత్రులు పలు సూచనలు చేశారు. లబ్ధిదారుల గుర్తింపులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని, పూర్తిగా అధికార యంత్రాంగమే క్షేత్రస్థాయి పరిశీలన కూడా పూర్తి చేసి అర్హులను గుర్తిస్తున్నట్లు మంత్రులు తెలిపారు.
రెండు పడక గదుల ఇళ్ల కోసం గుర్తించిన లబ్ధిదారులు అందరినీ వారికి కేటాయించిన ఇళ్ల వద్దనే అప్పజెప్పేలా పంపిణీ కార్యక్రమం ఉండాలని ఈ సందర్భంగా మంత్రులు సమావేశంలో సూచనలు చేశారు. గృహ లక్ష్మీ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక, పథకాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకు వెళ్లే విషయాన్ని కూడా మంత్రుల సమావేశంలో చర్చించారు.
Also Read: Deepika Kothari: అతడుగా మారుతున్న ఆమె, మధ్యప్రదేశ్ కానిస్టేబుల్ ఆపరేషన్‌కు అనుమతి
స్వతంత్ర దినోత్సవాన చెప్పిన సీఎం కేసీఆర్
అయితే 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్రంలోని నిరుపేద ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. హైదరాబాద్ లో నిర్మించిన లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేయబోతున్నట్లు ప్రకటించారు. గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో పేద ప్రజలకు ఇచ్చిన ఇండ్ల చాలీచాలకుండా ఉండేవని.. ఆ విషయం గుర్తించే బీఆర్ఎస్ సర్కారు డబుల్ బెడ్రూం ఇళ్ల కట్టిస్తున్నట్లు చెప్పారు. అయితే దీన్ని ఓ నిర్విరామ ప్రక్రియగా ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పారు.
హైదరాబాద్ మహా నగరంలో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేయనుందని తెలిపారు. సొంతంగా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని నిరుపేదల కోసం ప్రభుత్వం గృహలక్ష్మి అనే పథకాన్ని అమలు చేస్తుందన్నారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు గృహ నిర్మాణానికి మూడు దశల్లో మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. ముందుగా ప్రతీ నియోజక వర్గంలో మూడు వేల మందికి ఈ ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి గృహలక్ష్మీ పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించిందని కేసీఆర్ తెలిపారు.