TSRTC F-24 Ticket : హైదరాబాదీలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, రూ.300 చెల్లిస్తే నలుగురు రోజంతా ట్రావెల్!
TSRTC F-24 Ticket : ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ వీకెండ్స్, సెలవు రోజుల్లో కలిసి ప్రయాణించేందుకు F-24 టికెట్ ను అందుబాటులోకి తెచ్చింది.
TSRTC F-24 Ticket : హైదరాబాద్ వాసులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పంది. నగరంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రయాణాల కోసం F-24 టికెట్ టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.300 చెల్లించి నలుగురు 24 గంటల పాటు సిటీ బస్సుల్లో హైదరాబాద్ లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. వీకెండ్స్, సెలవు రోజుల్లో ఈ టికెట్ కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
#Hyderabad లోని ప్రజలకు శుభవార్త. కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం F-24 టికెట్ ను #TSRTC అందుబాటులోకి తెచ్చింది. రూ.300 చెల్లించి.. నలుగురు 24 గంటల పాటు సిటీ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. వీకెండ్స్, సెలవు రోజుల్లో ఈ టికెట్ కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటుంది. pic.twitter.com/YyvY6h4XSf
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) March 11, 2023
టీ6, ఎఫ్ 24 టికెట్లు
హైదరాబాద్ ప్రయాణికులను ఆకర్షించేందుకు టీఎస్ఆర్టీసీ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే వారికి ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. టీ6, ఎఫ్24 టికెట్ల పేరిట కొత్త ఆఫర్లను ప్రయాణికుల ముందుకు తెచ్చింది. ఈ టికెట్లకు సంబంధించిన పోస్టర్లను టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆవిష్కరించారు. మహిళలు సీనియర్ సిటిజెన్ల కోసం టీ6 టికెట్ ను అందుబాటులోకి తెచ్చింది. రూ.50 చెల్లించి టీ6 టికెట్ కొనుగోలు చేస్తే... ఆరు గంటల పాటు సిటీ బస్సుల్లో ప్రయాణించేందుకు అవకాశం కల్పించారు. ఇక కుటుంబ సభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం ఎఫ్24 టికెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ.300 చెల్లించి ఎఫ్24 టికెట్ కొనుగోలు చేస్తే ఆ టికెట్ పై నలుగురు వ్యక్తులు రోజంతా ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ఈ రెండు టికెట్లు శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి.
ఆర్టీసీ స్లీపర్ బస్సులు
ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే కొత్త సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్, సీటర్ కమ్ స్లీపర్ బస్సులను ప్రారంభించిన టీఎస్ ఆర్టీసీ.. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువ అయ్యేందుకు ఏసీ స్లీపర్ బస్సులను రూపొందించింది. ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు మార్చి నెలలో అందుబాటులోకి రాబోతున్నాయి.
కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడు లోని చెన్నై మార్గాల్లో ఈ బస్సులను సంస్థ నడపనుంది. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరి గానే ఏసీస్లీపర్ బస్సులకు ‘లహరి’ (Sleeper Buses Named A Lahari) గా సంస్థ నామకరణం చేసింది. హైదరాబాద్ లోని బస్ భవన్ ప్రాంగణంలో కొత్త ప్రోటో (నమూనా) ఏసీ స్లీపర్ బస్సును ఇటీవల టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా బస్సులను ప్రారంభించి.. ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణలో మొదటిసారిగా అందుబాటులోకి తీసుకు వస్తోన్న టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఎండీ సజ్జనార్ ఆశాభావం వ్యక్తం చేశారు.