Teachers Transfers : తెలంగాణలో టీచర్ల బదిలీలకు బ్రేక్, స్టే విధించిన హైకోర్టు
High Court on Teachers Transfers : తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్ పడింది. బదిలీలపై హైకోర్టు స్టే ఇచ్చింది.
High Court on Teachers Transfers : తెలంగాణలో టీచర్ల బదిలీలపై హైకోర్టు స్టే ఇచ్చింది. మార్చి 14 వరకు బదిలీల చేపట్టవద్దని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బదిలీలపై నాన్ స్పౌజ్ టీచర్ల అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. బదిలీల నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్లు కోర్టులో వాదనలు వినిపించారు. ఉద్యోగ దంపతులు, యూనియన్ నేతలు బదిలీ నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కోర్టు బదిలీలపై మార్చి 14వ తేదీ వరకు స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
నాలుగేళ్ల తర్వాత బదిలీలు
తెలంగాణలో నాలుగేళ్ల తర్వాత టీచర్ల బదిలీల ప్రక్రియ ప్రారంభం అయింది. అయితే బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు నిబంధనలు విధించింది. రెండేళ్ల సర్వీస్ పూర్తైన వాళ్లే బదిలీ కోసం అప్లై చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. దీంతో 317 జీవోతో ఇతర జిల్లాలకు బదిలీల అయిన ఉపాధ్యాయులు ఇప్పుడు ఆందోళన బాటపట్టారు. తామంతా ఇతర ప్రాంతాలకు వెళ్లి కేవలం ఒక సంవత్సరమే అయిందని, ప్రస్తుత బదిలీల్లో తమకు అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల్లో మార్పు చేసి తమకు కూడా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంలో కొంత మంది టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు.
మూడేళ్ల మినహాయింపు!
తెలంగాణలో 2015 జులైలో బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. మరోసారి 2018లో టీచర్ల బదిలీలు చేశారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. అయితే పదవీ విరమణకు ఇంకా మూడేళ్ల సర్వీస్ మాత్రమే ఉన్నవారిని ఈసారి బదిలీ చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో రెండేళ్ల సర్వీస్ ఉన్నవారికి బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చింది. పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచడంతో ఈసారి మూడేళ్ల సర్వీస్ మిగిలి ఉన్నా బదిలీ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నాలుగున్నరేళ్ల తర్వాత బదిలీలు, పదోన్నతులకు ఓకే చెప్పింది ప్రభుత్వం. ఈ బదిలీలకు విద్యాశాఖలో దాదాపు 90 వేల మంది టీచర్లు అర్హత సాధిస్తారు. గత నిబంధనల ప్రకారం ఒకచోట ఉపాధ్యాయుడు రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే బదిలీకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అవుతారు. ఈ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయుడు 8 ఏళ్లు, ప్రధానోపాధ్యాయుడు 5 ఏళ్లు మించి ఒకే చోట పనిచేయకూడదు. ఈ గరిష్ట సర్వీసుని పరిగణలోకి తీసుకొని అధికారులు బదిలీలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగులను కేటాయించింది ప్రభుత్వం. ఈ సమయంలో టీచర్లను కూడా ట్రాన్స్ ఫర్ చేసింది. సీనియారిటీ ప్రతిపాదికన ఆప్షన్లు ఇచ్చి ఈ ప్రక్రియ చేపట్టారు. అయితే ఈ విధానంపై అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. స్థానికతకు ప్రాధాన్యం లేకుండా కొత్త జిల్లాల కేటాయింపులు జరగడంతో చాలా మంది ఉపాధ్యాయులు సొంత ప్రాంతాలకు దూరంగా వెళ్లాల్సి వచ్చింది. ఉపాధ్యాయులుగా ఉన్న భార్యాభర్తలను చెరో జిల్లాకు కేటాయించడంతో అప్పట్లో ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తంచేశారు.