Hyderabad Traffic Diversions : రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు, ఈ రూట్లను అవాయిడ్ చేయండి!
Hyderabad Traffic Diversions : ప్రధాని మోదీ పర్యటన కారణంగా రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు.
Hyderabad Traffic Diversions : ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా రేపు(శనివారం) హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. శనివారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, ప్రకాష్ నగర్, రసూల్ పురా, ప్యాట్నీ సిగ్నల్ వరకు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. సోమాజిగూడా, రాజ్ భవన్ రోడ్, ఖైరతాబాద్ సిగ్నిల్ వరకు ట్రాఫిక్ ఉండే అవకాశాలున్నాయన్నారు. రేపు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ మార్గాల్లో కాకుండా వేరే మార్గాల్లో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
తెలంగాణలో ప్రధాని పర్యటన
ప్రధాని మోదీ శనివారం మధ్యాహ్నం 1.30కి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. బేగంపేట విమానాశ్రయంలో ప్రధాని మోదీకి బీజేపీ లీడర్లు, కార్యకర్తలు ఘన స్వాగతం పలకనున్నారు. విమానాశ్రయంలో బీజేపీ ముఖ్య నేతలతో ప్రధాని మోదీ కాసేపు మాట్లాడనున్నారు. అనంతరం గం.2.15 లకు ఎంఐ–17 హెలికాప్టర్‌లో ప్రధాని రామగుండం బయలుదేరివెళ్లనున్నారు. శనివారం మధ్యాహ్నాం 3.30కు రామగుండం ఎరువులు, రసాయనాల పరిశ్రమ (ఆర్‌ఎఫ్‌సీఎల్)ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. సాయంత్రం గం4.15లకు పలు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. రామగుండంలోని ఎన్టీపీసీ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడనున్నారు.
విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు
ప్రధాని మోదీ బహిరంగ సభ, రోడ్ షో కారణంగా నేడు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించారు. మద్దిలపాలెం ఏయూ ఆర్చ్ నుంచి త్రీ టౌన్ పోలీసు స్టేషన్ జంక్షన్ వైపు నుంచి గానీ, త్రీ టౌన్ పోలీసు స్టేషన్ జంక్షన్ వైపు నుంచి మద్దిలపాలెం ఏయూ ఆర్చ్ వైపు భద్రత కారణాల దృష్ట్యా ఎటువంటి సాధారణ వాహనాల రాకపోకలను అనుమతించడంలేదు.
ప్రయాణాలు వాయిదా వేసుకోండి
విశాఖలో పలు కార్యక్రమాలు ఉండడంతో సాధారణ ప్రయాణీకులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అత్యవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలన్నారు. 12వ తేదీన ప్రధాన మంత్రి బహిరంగ సభకు వచ్చే ప్రముఖులకు ప్రత్యేకమైన రూట్ ను కేటాయించారు. నోవాటెల్, సర్క్యూట్ హౌస్ నుంచి సెవెన్ హీల్స్ హాస్పిటల్ కుడి వైపునకు తిరిగి గొల్లలపాలెం జంక్షన్ మీదుగా ఆశీలమెట్ట స్వర్ణ భారతి స్టేడియం వద్ద వారికి కేటాయించిన ప్రత్యేకమైన రహదారి (BRTS) నుంచి ప్రయాణించి మద్దిలపాలెం AU Arch వద్దకు చేరుకోవాలి. వివిధ వాహనాల ద్వారా సభాస్థలికి వచ్చే వాహనదారులకు సంబంధిత రూట్ మాప్ కేటాయించారు.
భారీ వాహనాల దారి మళ్లింపు
12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు శ్రీకాకుళం, విజయనగరం నుంచి విశాఖపట్నం మీదుగా అనకాపల్లి వైపు వెళ్లే అన్నీ భారీ వాహనాలను ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి వైపుగా మళ్లించారు. అదే విధంగా అనకాపల్లి నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్లే అన్నీ రకాల భారీ వాహనాలను లంకెలపాలెం, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా మళ్లించారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ప్రధానంగా మద్దిలపాలెం ఆంధ్ర యూనివర్సిటీ పరిసర ప్రాంతాలైన పెద్ద వాల్తేరు కురుపాం సర్కల్ నుండి త్రీ టౌన్ పోలీ స్టేషన్ వైపు, స్వర్ణ భారతి నుంచి మద్దిలపాలెం వైపు, మద్దిపాలెం నుండి పిఠాపురం, మంగాపురం కాలనీ వైపు ఎటువంటి వాహనాలకు అనుమతిలేదు. శనివారం నగరంలో ప్రముఖుల పర్యటనలు, వారి భద్రతల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.