New Year Celebrations : న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే 6 నెలల జైలు శిక్ష
New Year Celebrations : న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. అర్ధరాత్రి 1 గంట వరకే వేడుకలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
New Year Celebrations : మరో పది రోజుల్లో న్యూ ఇయర్. డిసెంబర్ 31న వేడుకలకు ఇప్పటి నుంచే హడావుడి మొదలైంది. హోటళ్లు, రిసార్టులు, క్లబ్బులు న్యూ ఇయర్ వేడుకలకు సర్వం సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్ న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు నిబంధనలు విధించారు. త్రీ స్టార్ అంతకన్నా పెద్ద హోటళ్లు, పబ్బులు, క్లబ్బులకు కొన్ని నిబంధనలు పెట్టారు. డిసెంబర్ 31న రాత్రి 1 గంట వరకు నిర్వహించే వేడుకలకు 10 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలని సూచించారు. వేడుకల జరిగే ప్రదేశాల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, పార్కింగ్ లలో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు అమర్చాలని నిబంధన పెట్టారు. వేడుకల్లో సౌండ్ సిస్టిమ్ శబ్ధం 45 డెసిబెల్స్ పరిమితి మించకూడదన్నారు. ఈ వేడుకల్లో మద్యం సేవించిన వారు డ్రైవింగ్ చేయకుండా, వారు ఇంటికి చేరుకునేలా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని పోలీసులు తెలిపారు.
అర్ధరాత్రి 1 గంట వరకే అనుమతి
హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు ఆంక్షలు విధించారు. అర్ధ రాత్రి 1 గంట వరకు మాత్రమే న్యూ ఇయర్ వేడుకలకు అనుమతినిచ్చారు. ఎక్సైజ్ శాఖ నిర్దేశించిన టైం వరకే లిక్కర్ అమ్మకాలు చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పబ్బుల్లో మైనర్లను అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. న్యూ ఇయర్ వేడుకలకు 10 రోజుల ముందే అనుమతి తీసుకోవాలని నిర్వాహకులకు పోలీసులు సూచించారు. న్యూ ఇయర్ వేడుకల్లో అశ్లీల నృత్యాలు, అధిక శబ్దాలు వస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఈవెంట్స్ జరిగే ప్రదేశాలు మొత్తం కవర్ అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పబ్బులు, ఈవెంట్లలలో 45 డేసిబుల్స్ కన్నా ఎక్కువ సౌండ్ రాకుండా నియంత్రించాలని తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే రూ.10 వేల ఫైన్
న్యూ ఇయర్ వేడుకల్లో గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. వేడుకలకు సామర్థ్యం కన్నా ఎక్కువ పాసులు ఇవ్వరాదన్నారు. న్యూ ఇయర్ వేడుకల ప్రదేశాలు, పబ్బుల పార్కింగ్ ప్రదేశాల్లో డ్రగ్స్ అమ్మకాలు చేస్తే యాజమాన్యాలదే బాధ్యత అని చెప్పారు. ఈవెంట్ల నుంచి బయటకు వెళ్లే వారికి ప్రత్యేక క్యాబ్‌లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందని పోలీసులు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమని హోటళ్లు, పబ్బులు, ఈవెంట్ల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని పోలీసులు చెప్పారు. న్యూ ఇయర్ వేడుకల సమయంలో మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే రూ.10 వేల ఫైన్ తో పాటు 6 నెలల జైలు శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరించారు. మైనర్లు వాహనం నడిపి పట్టుబడితే వాహన యజమానిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పబ్బులు, న్యూ ఇయర్ వేడుకల ప్రదేశాలు, స్టార్ హోటళ్ల వద్ద పార్కింగ్ యాజమాన్యాలదే బాధ్యత అన్నారు. ఈ వేడుకల్లో శాంతి భద్రత సమస్యలు రాకుండా చూసుకోవాలని నిర్వాహకులకు పోలీసులు సూచించారు.