Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఇంటి వద్ద రెక్కీ, హైదరాబాద్ పోలీసులు ఏమన్నారంటే?
Pawan Kalyan : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై రెక్కీ, దాడికి కుట్ర జరగలేదని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటి రెక్కీ చేశారని వచ్చిన వార్తలపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. పవన్ ఇంటి వద్ద రెక్కీ జరగలేదని హైదరాబాద్ పోలీసులు తేల్చిచెప్పారు. రెక్కీ, దాడి చేసేందుకు కుట్ర జరగలేదని పోలీసులు వెల్లడించారు. పవన్ ఇంటి దగ్గర మద్యం మత్తులో యువకులు కారు ఆపారని, కారు తీయాలని పవన్ సెక్యూరిటీ చెప్పడంతో యువకులు గొడవకు దిగారని తెలిపారు. పవన్ ఇంటి వద్ద గొడవకు పాల్పడిన యువకులు ఆదిత్య విజయ్, వినోద్, సాయికృష్ణగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. యువకులను విచారించి నోటీసులు ఇచ్చినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు.
అసలేం జరిగింది?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందని, హైదరాబాద్ లోని పవన్ ఇంటి వద్ద రెక్కీ జరిగిందని జనసేన నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ఇంటి వద్ద రెక్కీపై చంద్రబాబు, సోము వీర్రాజు ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే రెక్కీపై వైసీపీ నేతలు స్పందించారు. పవన్ ను పట్టించుకునేంత తీరిక వైసీపీకి లేదన్నారు. ఇదంతా చంద్రబాబు కుట్ర అని ఆరోపించారు. తెలంగాణ పోలీసులు రెక్కీ విషయంపై నిజాలు తేల్చాలని కోరారు. తాజాగా ఈ విషయంపై పోలీసులు కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఇంటి వద్ద ఎలాంటి రెక్కీ, దాడికి కుట్ర జరగలేదని పోలీసులు నిర్ధరించారు. తాగిన మైకంలో యువకులు పవన్ ఇంటి వద్ద న్యూసెన్స్ చేశారని తెలిపారు. యువకులు పబ్‌కు వెళ్లి, మద్యం తాగి ఉన్నారని, తిరిగి వస్తూ పవన్ ఇంటి ముందు కారు ఆపారని న్యూసెన్స్ చేశారని తేల్చారు. ఆ సమయంలో అక్కడున్న పవన్ సిబ్బింది కారు తీయాలని కోరితే వారి మాట వినకుండా సిబ్బందితో గొడవ పడినట్టు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు యువకులను నోటీసులు జారీచేశామన్నారు. పవన్ ఇంటి ముందు ఆపిన కారు గుజరాత్ రిజిస్ట్రేషన్ ఉండగా, అది సాయికృష్ణకు చెందిన కారుగా పోలీసులు తెలిపారు.
అనుమానాస్పద వాహనాల్లో
ఇటీవల విశాఖలో జరిగిన ఘటనలు అనంతరం పవన్ కల్యాణ్ ను అనుమానాస్పద వాహనాల్లో కొందరు రెక్కీ చేశారని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. పవన్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి రెక్కీ నిర్వహిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. అనుమానాస్పద వాహనాల్లో కొందరు పవన్ ను అనుసరిస్తున్నారని, వారు అభిమానులు కాదన్నారు. వారి కదలికలు అనుమానంగా ఉన్నాయన్నారు. సోమవారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు పవన్ కల్యాణ్ ఇంటి వద్ద న్యూసెన్స్ చేశారు. ఈ ఘటనను వీడియో తీసిన పవన్ భద్రతా సిబ్బంది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు పవన్ ఇంటి వద్ద కారుతో న్యూసెన్స్ చేసిన యువకులను విచారించారు.
Also Read : Attack On Chandrababu : నందిగామలో చంద్రబాబు వాహనంపై రాళ్ల దాడి - సెక్యూరిటీ ఆఫీసర్‌కు గాయాలు





















