Hyderabad News: ఓఆర్ఆర్పై మూత్రం పోస్తుండగా బాలుడు దుర్మరణం
Hyderabad Crime News: ఆరేళ్ల బాలుడు రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేస్తుండగా గుర్తు తెలియని వాహనం టైరు వేగంగా దొర్లుకుంటూ వచ్చి అతణ్ని బలంగా ఢీకొంది. దీంతో బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Telugu News: హైదరాబాద్‌లో ఆరేళ్ల బాలుడు ఔటర్ రింగ్ రోడ్డుపై చనిపోయాడు. ఓఆర్ఆర్ పై మూత్ర విసర్జన చేస్తుండగా ఓ కారు టైరు ఆ బాలుడ్ని ఢీకొన్నట్లుగా పోలీసులు తెలిపారు. రోడ్డు పక్కన విసర్జన చేస్తుండగా ఎక్కడి నుంచో దొర్లుకుంటూ వచ్చిన టైరు తగిలి బాలుడికి తీవ్రంగా గాయాలు అయి చనిపోయాడు.
పటాన్ చెరు నియోజకవర్గంలోని అమీన్‌పూర్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అమీన్‌పూర్ మండలం పటేల్‌గూడ గ్రామానికి చెందిన సందీప్ రెడ్డి అనే వ్యక్తి గత ఆదివారం రాత్రి ముత్తంగి దాబాలో డిన్నర్ కోసం ఫ్యామిలీతో వెళ్లారు. అలా ఓఆర్ఆర్ పై వెళ్తుండగా.. సుల్తాన్‌పూర్ దగ్గర ఓఆర్‌ఆర్ ఎక్కిన కాసేపటికి వారి కుమారుడు మోక్షిత్ రెడ్డి (6) మూత్రం వస్తోందని అనడంతో ఔటర్ రింగ్ రోడ్డుపైనే కారును పక్కకు ఆపారు. అలా బాలుడు రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేస్తుండగా గుర్తు తెలియని వాహనపు టైరు దొర్లుకుంటూ వచ్చి అతణ్ని బలంగా ఢీకొంది.
తీవ్ర గాయాలు కావడంతో తల్లిదండ్రులు హుటాహుటిన ముత్తంగిలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నగరంలో మరో ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందాడు. ఓఆర్‌ఆర్‌పై వాహనాలు స్పీడుగ వెళ్తుండగా.. ఏదో వాహనం టైరు ఊడిపోయి వేగంగా దొర్లుకుంటూ వచ్చి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.