Pic Of The Day: బాబ్లీ కలిపింది అందరినీ, ఒకే చోట ఆ పార్టీ మాజీ నేతలు
17 ఏళ్ల నాటి కేసుకు ఇవాళ ముగింపు వచ్చింది. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంపై నిరసన చేపట్టిన టీడీపీ బృందంపై 2005 పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవాళ ఈ కేసును కోర్టు కొట్టేసింది.
17 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘటన అది. గోదావరిపై బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా టీడీపీ నిరసన చేపట్టింది. ఈ నిరసనలో టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు. ప్రస్తుతం వీరంతా అధికార టీఆర్ఎస్ తో సహా వేరు వేరు పార్టీల్లో ఉన్నారు. అయినా ఈ కేసు వీరందరినీ కలిపింది. సుదీర్ఘంగా జరిగిన కేసు విచారణకు కోర్టు ముగింపు పలుకుతూ కేసును కొట్టేసింది. దీంతో ఆనందంగా ఈ కేసులో ఉన్న నేతలందరూ ఫొటోకి ఫోజులిచ్చారు. అప్పట్లో వీరంతా ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పుడు వేరు వేరు పార్టీల్లో ఉన్నారు. అయినా అప్పటి స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ కాసేపు సంతోషంగా గడిపారు. ఆనాటి ఘటనలు గుర్తుచేసుకున్నారు. ఈ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
2005లో దాదాపు 17 ఏళ్ల క్రితం మహారాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా సరిహద్దులో గోదావరి నదిపై బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది. ఈ పనులను అడ్డుకోవడానికి అప్పట్లో టీడీపీ బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించింది. దీంతో తెలుగుదేశం నాయకులపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతుంది. ఇవాళ ఆ కేసును న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో మాజీ మంత్రులు తూళ్ల దేవేందర్ గౌడ్, నాగం జనార్ధన్ రెడ్డి, ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రులు వేణుగోపాల చారి, కడియం శ్రీహరి, రేవురి ప్రకాష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, చాడ సురేష్ రెడ్డి, మారుతి, బొడ్డు వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. ఈ కేసును కోర్టు కొట్టేసిన సంతోషంలో నాయకులు, కేసు వాదించిన న్యాయవాదులు గ్రూప్ ఫొటో దిగారు. ప్రస్తుతం వీరంతా వేరు వేరు పార్టీలతో చేరారు. వీరంతా కేసు విచారణ కోసం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. చాలా కాలం తర్వాత పాత మిత్రులు కలవడంతో అందరూ ఒకరికొకరు పలకరించుకున్నారు. అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు.
2005లో అప్పటి తెలుగుదేశం పార్టీ నేతలు మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్లారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ వల్ల శ్రీరాంసాగర్ కు గోదావరి నీరు రాదని నిరసన చేసేందుకు వెళ్లారు. మహారాష్ట్ర గోదావరి నదీ జలాలను దోచుకుంటుందని టీడీపీ పార్టీ ఆరోపణలు చేసింది. అప్పట్లో తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉంది. టీడీపీ పార్టీ తెలంగాణ ప్రజల సానుభూతి వ్యక్తం చేసేందుకు తెలంగాణ నినాదాన్ని ఎత్తుకుందని ఇతర పార్టీలు, మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోపించాయి. ఆ సమయంలో అక్కడి రైతులు, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై టీడీపీ నేతలైన మాజీ మంత్రులు దేవేందర్ గౌడ్, నాగం జనార్థన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేణుగోపాలాచారి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, చాడ సురేష్ రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసుపై విచారణ జరిగింది. ఇవాళ న్యాయస్థానం ఈ కేసులను కొట్టేసింది.