Hyderabad Minor Girl Case : ఎమ్మెల్యే రఘునందన్ చేతికి ఫొటోలు, వీడియోలు ఎలా వెళ్లాయ్, ఆరా తీస్తున్న పోలీసులు!
Hyderabad Minor Girl Case : జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు, వీడియోలను ఎమ్మెల్యే రఘునందన్ రావు బయటపెట్టారు. దీంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. అవి ఎలా లీక్ అయ్యాయని పోలీసులు ఆరా తీస్తున్నారు.
Hyderabad Minor Girl Case : హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విడుదల చేశారు. హైదరాబాద్‌లో మీడియా మీట్ నిర్వహించిన బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు ఈ ఫొటోలను రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా ఇంటెలిజెన్స్ ఉలిక్కిపడింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ, లా అండ్ ఆర్డర్, ఇంటెలిజెన్స్, వెస్ట్ జోన్ పోలీసులతో పాటు పలువురు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. అసలు నిందితుల వీడియోలు, ఫొటోలు ఎలా లీక్ అయ్యాయన్న దానిపై పోలీసులు ఆరాతీస్తు్న్నారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఈ వీడియోలు ఎలా వచ్చాయన్న దానిపై పోలీసు అధికారులు చర్చిస్తున్నారు. ఇవాళ సాయంత్రం ఉన్నతాధికారులు ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ కేసును సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తు్న్నారు. ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డికి వినతి పత్రం అందించారు.
ఎవరినీ వదిలిపెట్టం : హోంమంత్రి
జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటనపై హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. ఈ సంఘటన దురదృష్టకరమన్న ఆయన నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసులో బాధితుల ఫిర్యాదుతో పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు. పోలీసులపై ఎలాంటి ఒత్తిడి లేదన్న హోంమంత్రి స్వతంత్రంగా దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. హైదరాబాద్ హజ్ హౌస్ లో జరిగిన హజ్ యాత్రికుల వాక్సినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ బండి సంజయ్ లేఖ
బాలికపై అత్యాచార ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. బాలికపై అత్యాచార ఘటనపై పోలీసుల తీరును ఆయన తప్పుపట్టారు. నిందితులను రక్షించడానికి పోలీసులు కేసును పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. బాలికపై అత్యాచారం కేసులో ఎలాంటి అనుమానాలకు తావులేకుండా నిందితులకు కాపాడుతున్నారనే డౌట్ ను తొలగించుకోవాలని సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. పలుకుబడిన వారి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్న ఘటనలో పోలీసులు నిష్ఫక్షపాతంగా ఎలా దర్యాప్తు చేయగలరన్నారు. బాలికపై అత్యాచారం కేసులో సీబీఐతో విచారణ జరిపించకపోతే న్యాయపోరాటం చేస్తామన్నారు. బీజేపీ బాధితులకు అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలోని పబ్బులను మూసివేయాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతల సమస్యపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. బాలికపై జరిగిన అత్యాచారం కేసులో ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు మీడియా ముందు బయటపెట్టారు. తమ వద్ద మరిన్ని ఆధారాలు ఉన్నాయని వాటిని పోలీసులకు, న్యాయస్థానానికి అందిస్తామన్నారు.