Ministers Meet Governor : తమిళి సైతో మంత్రి ప్రశాంత్ రెడ్డి భేటీ, గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ కు డేట్ ఫిక్స్
Ministers Meet Governor : హైదరాబాద్ కు చేరుకున్న గవర్నర్ తమిళి సై తో మంత్రి ప్రశాంత్ రెడ్డి భేటీ అయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించేందుకు రావాల్సిందిగా గవర్నర్ ను ఆహ్వానించారు.
Ministers Meet Governor : పుదుచ్చేరి పర్యటన ముగించుకున్న గవర్నర్ తమిళి సై హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. రాజ్ భవన్ కు చేరుకున్న గవర్నర్ తమిళి సైను మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఉన్నతాధికారులు కలిశారు. బడ్జెట్ ప్రతిపాదనకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం తరఫున గవర్నర్ ను కోరారు. బడ్జె్ట్ సమావేశాల్లో ప్రసంగించేందుకు రావాల్సిందిగా గవర్నర్ తమిళి సై ను ఆహ్వానించారు. ఉభయ సభల ప్రోరోగ్, తిరిగి సమావేశమయ్యేందుకు నోటిఫికేషన్, గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిఫారసు అంశాలపై గవర్నర్ తో చర్చించారు. బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన స్పీచ్ కాపీని మంత్రి గవర్నర్ కు అందించారు. పెండింగ్ బిల్లుపై చర్చకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. రాజ్ భవన్ , ప్రగతి భవన్ మధ్య దూరం పెరిగిన క్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి గవర్నర్ ను కలిసి చర్చించడం ఆసక్తికరంగా మారింది. గతంలో రెండుసార్లు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈసారి కూడా గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని భావించినా చివరికి ఆ నిర్ణయాన్ని మార్చుకుంది ప్రభుత్వం. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ స్పీచ్ ఉంటుందని తెలిపింది. ఈ మేరకు గవర్నర్ ను బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించారు. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తేదీని ఖరారు చేసింది. ఫిబ్రవరి 3 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, 3వ తేదీ మధ్యాహ్నం గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 6న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.
రాజ్ భవన్ తో రాజీ
అయితే ఫిబ్రవరి 3న బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలపాలని గవర్నర్ కు ఈ నెల 21న లేఖ రాసింది ప్రభుత్వం. అయితే గవర్నర్ అనుమతి తెలిపే విషయాన్ని పెండింగ్ లో పెట్టారు. రాజ్‌భవన్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ప్రభుత్వం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేసింది. బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపేలా గవర్నర్ ను ఆదేశించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వాలని వాదించింది. కానీ అనుహ్యంగా హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో ప్రభుత్వం ఒక మెట్టు దిగి రాజ్ భవన్ తో రాజీకి వచ్చింది. మంత్రులు గవర్నర్ తో భేటీ అయ్యి బడ్జెట్ కు అనుమతి ఇవ్వడంతో పాటు ఉభయసభల్లో ప్రసంగించాలని కోరారు. ఇందుకు గవర్నర్ అంగీకరించనట్లు సమాచారం.
బడ్జెట్ సమావేశాలు
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి మూడో తేదీన మధ్యాహ్నం 12.10 గంటలకుత ప్రారంభించాలని నిర్ణయించారు. సాధారణంగా బడ్జెట్ సమావేశాలకు ముందు ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగిస్తారు. కానీ తెలంగాణ సర్కార్ కు.. గవర్నర్ కు మధ్య విబేధాలు ఉండటంతో గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీంతో కొత్త సమావేశాలు కాదని.. పాత సమావేశాలకు కొనసాగింపేనని చెబుతూ.. శాసనసభ 8వ సెషన్ 4వ విడత సమావేశాలంటూ ప్రకటన చేశారు. గతేడాది సెప్టెంబర్లో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. అయితే అసెంబ్లీని ప్రోరోగ్ చేయలేదు. దీంతో గత సమావేశాలకు కొనసాగింపుగానే.. ఫిబ్రవరి సెషన్స్ కొనసాగుతాయని ప్రకటించారు. అయితే బడ్జెట్‌కు రాజ్యాంగపరంగా గవర్నర్ ఆమోదం తప్పని సరి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి రాజ్ భవన్‌కు బడ్జెట్ వెళ్లింది. కానీ బడ్జెట్ ను గవర్నర్ ఆమోదించలేదు. కానీ అసెంబ్లీ సంయుక్త సమావేశం ఎందుకు లేదు ? గవర్నర్ ప్రసంగం ఎందుకు లేదు ? అని ప్రశ్నిస్తూ ఓ లేఖను తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ పంపారు. ఈ కారణంగానే గవర్నర్ బడ్జెట్ ఆమోదించేలా ఆదేశించాలని తెలంగాణ సర్కార్ హైకోర్టుకు వెళ్లింది. అంతిమంగా తమ వాదన రాజ్యాంగ పరంగా నిలబడదని అనుకున్నారేమో కానీ.. చివరికి గవర్నర్ విషయంలో పూర్తి స్థాయిలో వెనక్కి తగ్గారు.