Minister Talasani Srinivas : అలాంటి భవనాలు హైదరాబాద్ లో 25 వేల వరకు ఉండొచ్చు, రాత్రి రాత్రికి అక్రమకట్టడాలు తొలగించలేం- మంత్రి తలసాని
Minister Talasani Srinivas : డెక్కన్ మాల్ లాంటి భవనాలు హైదరాబాద్ లో 25 వేల వరకు ఉండొచ్చని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Minister Talasani Srinivas : సికింద్రాబాద్ రాంగోపాల్‌పేటలోని డెక్కన్ మాల్ అగ్నిప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం అలెర్ట్ అయింది. ఈ నెల 23న అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ, ఫైర్ సేఫ్టీ, రెవెన్యూ అధికారులతో మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ అర్వింద్ కుమార్ భేటీ కానున్నారు. హైదరాబాద్ వాణిజ్య భవనాల నిర్మాణ అనుమతులు, ఫైర్ సేఫ్టీ అనుమతులు, పలు అంశాలపై చర్చించనున్నట్టు అర్వింద్ కుమార్ తెలిపారు.
రాంగోపాల్ పేట సమీపం లోని నల్లగుట్ట ప్రాంతంలో నిన్న జరిగిన అగ్నిప్రమాద ఘటన పై బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది.
— Talasani Srinivas Yadav (@YadavTalasani) January 20, 2023
ఈ సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు. pic.twitter.com/fo8wCTAInR
అలాంటి భవనాలు 25 వేల వరకు ఉండొచ్చు - మంత్రి తలసాని
హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం జరిగిన భవనం లాంటి బిల్డింగులు నగరంలో సుమారు 25 వేల వరకు ఉండొచ్చన్నారు. హైదరాబాద్ లోని అక్రమ కట్టడాలను రాత్రి రాత్రికి తొలగించలేమన్నారు. ఈ విషయంపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. అగ్నిప్రమాద ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించాయన్నారు. డెక్కన్ మాల్ భవనంలో కెమికల్స్ ఉన్నందున మంటలు త్వరగా అదుపులోకి రాలేదన్నారు. డెక్కన్ మాల్ నాణ్యతపై వరంగల్ నిట్ నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని తెలిపారు.హైదరాబాద్ అక్రమ భవనాల కట్టడాల విషయంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈనెల 25న కమిటీ సమావేశం జరుగుతుందని చెప్పారు. సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వ విభాగాలన్నీ యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నించారన్నారు. మంటలు పక్కన ఉన్న బస్తీకి వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. అగ్ని ప్రమాదానికి గురైన భవనం లాంటివి 25 వేల వరకు హైదరాబాద్ లో ఉండవచ్చన్నారు. అక్రమ కట్టడాల విషయంలో ఉన్నత స్థాయి కమిటీ వేస్తున్నామని వెల్లడించారు.
బీఆర్ఎస్ పై హైకోర్టులో స్టే
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... ఆయన టూరిస్టులా వచ్చి మాట్లాడుతున్నారని విమర్శించారు. డబ్బుల కోసం అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరిస్తున్నారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క భవనాన్ని కూడా క్రమబద్ధీకరించలేదన్నారు. ఈ అంశంపై హైకోర్టు స్టే ఉందన్న విషయం కిషన్‌రెడ్డికి తెలీదా? అని నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఒక్క భవనాన్ని కూడా రెగ్యులరైజ్ చేయలేదన్నారు. భవనాల క్రమబద్ధీకరణపై హైకోర్టు స్టే ఉందన్నారు. హైదరాబాద్ కు కిషన్ రెడ్డి ఒక్క పైసా తెచ్చింది లేదని తలసాని విమర్శించారు. గుజరాత్ లో కూడా వంతెన కూలి 180 మంది మరణించారని, కిషన్ రెడ్డి లాగా తాము రాజకీయాలు చేయలేదన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ఎనిమిదేళ్లలో రూ.65 వేల కోట్లు కేటాయించామన్నారు. గతంలో జరిగిన అన్ని ప్రమాదాల్లో బాధితులకు పరిహారం అందజేశామని మంత్రి తలసాని గుర్తుచేశారు. బిహార్ కు చెందిన వ్యక్తులు ఇక్కడ ప్రమాదంలో చనిపోతే సీఎం కేసీఆర్ స్వయంగా ఆ రాష్ట్రానికి వెళ్లి ఎక్స్‌గ్రేషియా చెక్కులు అందించారన్నారు.